వారు ఎంతిచ్చారు?
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:28 PM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు నగదు పంపిణీ చేస్తున్నాయి.
-జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటుకు నోటు పంపకాలు
-ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీగా నగదు పంపిణీ
-ఒకరు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇచ్చేందుకు వ్యూహాలు
-ముందుగా ఎవరు పంపిణీ చేస్తారోనని ఎదురుచూపులు
-ఎస్.కోట నియోజకవర్గంలో ఓటుకు రూ.1000 వరకు పైకం
శృంగవరపుకోట, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు నగదు పంపిణీ చేస్తున్నాయి. ఓటుకు ఎంత ఇవ్వాలన్న దానిపై లెక్కలు వేసుకుంటూ.. ప్రత్యర్థి పార్టీ కంటే ఎక్కువ పంపిణీ చేస్తున్నాయి. ముఖ్యంగా పోటీ తీవ్రంగా ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో ఓటుకు రూ.500 రూ.1000 వరకు ఇచ్చేందుకు అభ్యర్థులు బుధవారం సిద్ధమయ్యారు. ఎవరు ముందుగా పంపిణీ చేస్తారోనని ఇరు పార్టీల అభ్యర్థులు ఆరా తీశారు.
శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఓ ఎంపీటీసీ స్థానంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నామినేషన్ల నుంచి ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీపడ్డారు. ఒకరు ఇంటింటికీ లీటరు డ్రింక్ బాటిల్ పంపిణీ చేయగా.. మరొకరు రెండు లీటర్ల బాటిళ్లు అందించారు. ఒకరు మహిళలకు చీరలు పంచితే.. ప్రత్యర్థి అంతకంటే ఖరీదైన చీరలు పంపిణీ చేశారు. ఇప్పుడు పోలింగ్ సమయం దగ్గరపడటంతో నగదు పంపిణీకి సిద్ధమయ్యారు. ప్రత్యర్థి ఇచ్చే మొత్తంకంటే 100-200 ఎక్కువ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
- స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే అభ్యర్థులు ఖర్చుకు సిద్ధమయ్యారు. కొందరు స్థిరాస్తులు విక్రయించగా, మరికొందరు తనఖా పెట్టి డబ్బు సమకూర్చుకున్నారు. పార్టీ ఫండ్‌తో పాటు జడ్పీటీసీ అభ్యర్థుల వాటాను కలిపి ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని స్థానాల్లో ఒక పార్టీ ఓటుకు రూ.500 పంపిణీ చేయగా.. గట్టి పోటీ ఉన్న చోట్ల ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న చోట్ల మాత్రం తమకు అనుకూలంగా ఓటేస్తారనుకున్న వారికే నగదు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
- ఎస్.కోట మండలంలోని ఓ ఎంపీటీసీ స్థానం, వేపాడ మండలంలోని రెండు, జామి మండలంలోని మరో స్థానంలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ గెలిచినవారికి ఎంపీపీ, ఉప ఎంపీపీ పదవులు దక్కే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎంపీపీ ఆశావహుల గెలుపోటములు మండల రాజకీయాలపై ప్రభావం చూపుతాయని భావిస్తూ భారీగా ఖర్చు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఓడించి బలహీనమైన నాయకుడిని గెలిపిస్తే రాజకీయంగా పైచేయి సాధించవచ్చన్న వ్యూహంతోనూ పావులు కదుపుతున్నాయి.
-ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు రావడంతో ప్రత్యర్థి పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మరింత దృష్టి పెట్టింది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రూ.5 లక్షల వరకు పార్టీ ఫండ్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు అభ్యర్థులు ఆ మొత్తానికే పరిమితమవుతుండగా.. గ్రామాల్లో పట్టున్న వారు సొంత డబ్బును కూడా జోడించి పంపిణీ చేస్తున్నారు. ఓ వైపు ఓటర్ల ముఖాల్లో ఆనందం కనిపిస్తుండగా.. మరోవైపు ఖర్చు చేసినా గెలుస్తామో లేదోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.