Share News

ఎన్నాళ్లీ కష్టాలు?

ABN , Publish Date - May 22 , 2026 | 11:35 PM

జిల్లాలో గ్యాస్‌ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద వందలాది మంది వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది.

ఎన్నాళ్లీ కష్టాలు?
ఎస్‌.కోట పట్టణంలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద గుమిగూడిన వినియోగదారులు

- గ్యాస్‌ కోసం వినియోగదారుల పాట్లు

- ఇంటికి సరఫరా కాని సిలిండర్లు

-ఏజెన్సీల వద్దకు పరుగులు

- ఇరాన్‌-అమెరికా యుద్ధం నాటి నుంచి ఇదే పరిస్థితి

- గ్యాస్‌ బుకింగ్‌ చేసి పదిహేను రోజులు దాటిపోతున్నా సిలిండర్‌ ఇంటికి రావడం లేదు. డెలివరీ బాయ్‌లకు ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ చేస్తున్నారు. ఏజెన్సీ వద్ద తీసుకుందామని వెళ్తే అక్కడ నాలాంటి వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. గ్యాస్‌ అందక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- ఓ గ్యాస్‌ వినియోగదారుడు, శృంగవరపుకోట

శృంగవరపుకోట, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్యాస్‌ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద వందలాది మంది వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. పనులు మానుకొని తెల్లవారుజూము నుంచే గోడౌన్‌ల వద్ద క్యూ కట్టేస్తున్నారు. సిలిండర్లను డోర్‌ డెలివరీ చేస్తామని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నా వారు వినడం లేదు. బుక్‌ చేసి పదిహేను రోజులు దాటిందని, సిలిండర్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సిలిండర్‌ చేతికి అందేవరకూ కదలడం లేదు. అమెరికా-ఇరాన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్‌ కొరత లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నప్పటికీ ఏజెన్సీలు మాత్రం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నాయి. సిలిండర్‌ను బుక్‌ చేసిన తరువాత వినియోగదారుడు నెలరోజుల పాటు అడగకుంటే ఇక దాని గురించి మరిచిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సిలిండర్‌ను వేరేకొరికి ఇచ్చేశామని, డెలివరీ జరిగిపోయిందంటూ ఏజెన్సీలు చెబుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అందుకే బుక్‌ చేసిన పదహారు రోజు నుంచే వినియోగదారులు ఏజెన్సీల వెంట పడుతున్నారు. అయితే, సిలిండర్లను డెలివరీ చేసేలోపే వినియోగదారులు ఏజెన్సీల వద్దకు వచ్చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. కొంతమంది ఏజెన్సీల నిర్వాహకులు బ్లాక్‌లో సిలిండర్లను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీ, టిఫిన్‌ దుకాణాలకు, హోటళ్లకు తెరచాటున సిలిండర్లను పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ దుకాణంలో చూసినా వాణిజ్య సిలిండర్లకు బదులు గృహా వినియోగ సిలిండర్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో చాలా గ్రామాల్లో గ్రామ దేవతల పండగలు జరుగుతున్నాయి. బంధు, మిత్రులకు విందు భోజనాలు పెడుతున్నారు. దీంతో మరింత గ్యాస్‌ అవసరం పెరిగింది. పరపతి కలిగిన కుటుంబాలకు గ్యాస్‌ సిలిండర్‌లు అందుతున్నాయి. మిగతా వారికి సిలిండర్లు దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అవసరాలకు సరిపడ గ్యాస్‌ సరఫరా జరిగేలా జిల్లా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

వినియోగదారులు ఆగడం లేదు

గ్యాస్‌ సిలిండర్లను డోర్‌ డెలివరీ చేసే వరకూ వినియోగదారులు ఆగడం లేదు. ఏజెన్సీల వద్దకు వచ్చేస్తున్నారు. శృంగవరపుకోట పట్టణంలోని గ్యాస్‌ ఏజెన్సీకి రోజుకు వెయ్యి వరకు సిలిండర్లు రావాల్సి ఉంది. కానీ, ఒక్కోసారి ఐదు వందల వరకే వస్తున్నాయి. దీంతో కొంత కొరత కనిపిస్తుంది. ఈ విషయాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి దృష్టిలో పెట్టాను.

-ఎల్‌.జయలక్ష్మి, పౌరసరఫరాల ఉప తహసీల్దార్‌, శృంగవరపుకోట

Updated Date - May 22 , 2026 | 11:35 PM