How many more? ఇంకెందరో?
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:02 AM
How many more?చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన పరిణామం జిల్లా వైసీపీలో పెను ప్రకంపనలు తీసుకొస్తోంది. వరుసగా ద్వితీయ శ్రేణి నాయకులు.. స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేయడం ప్రారంభించారు. గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా పార్టీ మారేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ముందుముందు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో.. కీలక నాయకులంతా వెళ్లిపోతే పార్టీ పరిస్థితి ఏంటో అన్న కలవరం మిగతా నేతలకు పట్టుకుంది.
ఇంకెందరో?
చిన్నశ్రీను తర్వాత రాజీనామాల పరంపర
వైసీపీ జిల్లా నాయకుల్లో అభద్రతాభావం
గ్రూపులుగా పార్టీ మారుతున్న గ్రామస్థాయి నాయకులు
చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన పరిణామం జిల్లా వైసీపీలో పెను ప్రకంపనలు తీసుకొస్తోంది. వరుసగా ద్వితీయ శ్రేణి నాయకులు.. స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేయడం ప్రారంభించారు. గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా పార్టీ మారేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ముందుముందు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో.. కీలక నాయకులంతా వెళ్లిపోతే పార్టీ పరిస్థితి ఏంటో అన్న కలవరం మిగతా నేతలకు పట్టుకుంది.
విజయనగరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):
చిన్న శ్రీను బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొదట ఐదుగురు జడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, గజపతినగరం జడ్పీటీసీ గార తవుడు, గంట్యాడ జడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, విజయనగరం జడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, కొత్తవలస జడ్పీటీసీ నెక్కల శ్రీదేవితో పాటు కొత్తవలసకు చెందిన కొప్పల వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కూడా చిన్నశ్రీను వెంట నడిచారు. ఇంకొందరు బయటపడేందుకు తగిన సమయం కోసం చూస్తున్నట్లు సమాచారం.
మెరకముడిదాం మండలంలో కుదుపు మొదలైంది. అక్కడి నుంచే జడ్పీటీసీగా ఎన్నికై జడ్పీ చైర్మన్ అయిన మజ్జి శ్రీనివాసరావు వెంట నడిచేందుకు అధికంగా క్యూలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే దివంగత కోట్ల సన్యాశిఅప్పలనాయుడు ముగ్గురు కుమారుల్లో ఇద్దరు టీడీపీలో ఉన్నారు. వైసీపీ మండల అధ్యక్షుడుగా ఉన్న కోట్ల విశ్వేస్వరరావు (వెంకటరావు) కూడా చిన్నశ్రీను బాటలో నడిచారు. ఈ విషయం మాజీ మంత్రి బొత్సకు మరింత ఆశ్చర్యానికి గురిచేసిందట. చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో వైసీపీకి మరో కుదుపు వచ్చింది. మండలంలోని 13 గ్రామాలకుగాను 12 గ్రామాల్లో వైసీపీ పార్టీశ్రేణులు భారీగా చిన్నశ్రీను వెంట నడుస్తున్నారు. బూత్ కమిటీల జిల్లా కన్వీనర్ మాజీ సర్పంచ్, వైస్ ఎంపీపీ బూర్లె నరేష్‌కుమార్‌తో పాటు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, గ్రామస్థాయి నాయకులు కలిపి 22 మంది వైసీపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం కూడా నష్టనివారణ చర్యలకు దిగినట్లు వార్తలు వచ్చాయి. చిన్న శ్రీనుతో సన్నిహితంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ ముఖ్య నేతలు ఫోన్లు చేసి పార్టీని వీడొద్దని కోరుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బడ్డుకొండ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో?
మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీకి రాజీనామా పరిణామం కూడా సంచలనమైంది. కొద్దిరోజులుగా ఆయన వేయనున్న అడుగులపై ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన స్పందించలేదు. వియ్యంకుడు చిన్న శ్రీను పార్టీ మారినా కూడా బడ్డుకొండ వైసీపీలోనే కొనసాగారు. అంతేకాకుండా తాను బొత్స సత్యనారాయణ వెంటే ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. అంతలోనే అదే రోజు రాత్రి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. అయినా కూడా బడ్డుకొండ పెద్దగా స్పందించలేదు. వైసీపీ అధినేత సానుకూలంగా స్పందిస్తారేమోనని వేచి చూసినట్లు చెబుతున్నారు. శుక్రవారం పార్టీ నుంచే సస్పెండ్ చేయడంతో బడ్డుకొండ మనసులో మాట చెప్పేశారు.
వైసీపీ క్యాడర్‌లో అభద్రత భావం..!
చిన్న శ్రీనుతో గతంలో సఖ్యతగా ఉండి వైసీపీలో కొనసాగుతున్న నాయకుల్లో తీవ్ర అభద్రత భావం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడిన నాయకుడి సన్నిహితుడిపై చర్యలు తీసుకోవడంతో రేపు మన పరిస్థితి ఏమిటి?అనే ప్రశ్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో తలెత్తుతోంది.
ఒక్కొక్క పరిణామం ఇలా..
సెప్టెంబరు 8: చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరిసహస్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
సెప్టెంబరు 12: నెల్లిమర్ల ఇన్‌చార్జిగా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడును తప్పించి గదల సన్యాసినాయుడును నియమించారు.
సెప్టెంబరు 23: ఐదుగురు జడ్పీటీసీలు వైసీపీకి, తమ పదవులకు రాజీనామా చేశారు.
సెప్టెంబరు 27: మెరకముడిదాం మండలంలోని 13 గ్రామాలకు చెందిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
అక్టోబరు 2: బడ్డుకొండ అప్పలనాయుడుపై వైసీపీ సస్పెన్షన్ వేటువేసింది.
భవిష్యత్ ఎలా?
టీడీపీలోకి వలసలను ఆ పార్టీ నాయకులు నిలువరించలేకపోతున్నారు. ఇంకెంత మంది వెళ్తారో ? అనే దానికంటే వెళ్లిన వారి తర్వాత మిగిలిన కేడర్‌ను వైసీపీ ఎలా నిలబెట్టుకుంటుందా? అనే పశ్న తలెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రాజీనామా చేసిన వారిలో కొందరు టీడీపీలో చేరడం ఇప్పటికే ప్రారంభమైంది. మిగిలిన వారు ఎటు వెళ్తారు ? అనేది కొద్దిరోజుల్లో స్పష్టత రావొచ్చు. బడ్డుకొండపై తాజా చర్య తర్వాత మరిన్ని రాజకీయ కదలికలు ఉంటాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
----------------------