ఎన్నాళ్లీ ట్రాఫిక్ కష్టాలు?
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:32 PM
: జిల్లా కేంద్రం పార్వతీపురం రోజు రోజుకూ ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుంటుంది.
- పార్వతీపురంలో పెరుగుతున్న వాహనాల రద్దీ
- భారీ వాహనాల రాకపోకలతో ఇబ్బందులు
- ప్రణాళికలకే పరిమితమైన ఔటర్ రింగ్ రోడ్డు
పార్వతీపురంటౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం రోజు రోజుకూ ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుంటుంది. ప్రధాన రహదారితో పాటు పలు కూడళ్ల వద్ద భారీ వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్ నిలిచిపోతుండడంతో పాదచారులు, వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. బెలగాం గెడ్డవీధి నుంచి పట్టణంలోని రాయగడ రోడ్డు శివారు వరకు గల ప్రధాన రహదారే వ్యాపార కేంద్రం కావడంతో ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాతబస్టాండ్ కూడలి మీదుగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే, ఆర్టీసీ కాంప్లెక్స్, పాతబస్టాండ్, నాలుగురోడ్ల కూడలి, సౌందర్య థేయేటర్ కూడళ్ల వద్ద ఇరుకైనా రహదారులతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ట్రాఫిక్ పోలీసు సిబ్బంది లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, పాతబస్టాండ్ కూడళ్ల మీదుగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడో?
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు 2016లో ఒకసారి, 2022లో మరోసారి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కేంద్ర శివారులోని వైకేఎం కాలనీ నుంచి మండలంలోని వెంకంపేట మీదుగా కొమరాడ మండలం సివిని సమీపం గుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో సర్వేలు నిర్వహించారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో రింగ్ రోడ్డు పనులకు పచ్చ జెండా ఊపినప్పటికీ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాంకేతిక లోపాలు చూపి ఆ పనులను ఆపేసినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు పనులకు బ్రేకు పడడంతో జిల్లా కేంద్ర ప్రజలు ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..
ట్రాఫిక్ నియంత్రణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్, పాతబస్టాండ్ కూడళ్లతో పాటు సౌందర్య థియేటర్ రోడ్డు వీధి, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉన్న పోలీసు సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది అవసరం ఉందని, ఉన్నతాధికారులకు నివేదించాం.
-వెంకటరావు, ఇన్‌స్పెక్టర్, పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్