how long action will take! విచారించి ఆరు నెలలు.. చర్యలకు ఎన్నాళ్లో!
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:27 PM
how long action will take! వైసీపీ హయాంలో ఇళ్లు కాదు.. ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తామని చెప్పారు. జగనన్న కాలనీల పేరుతో భారీ లేఅవుట్లు వేశారు. పట్టణాల్లో లబ్ధిదారులకు సెంటు భూమి చొప్పున అందించారు. అయితే పేదలకంటే నేతలే అప్పట్లో లబ్ధి పొందారు అన్నది బహిరంగ రహస్యం. ఆ ఇళ్ల స్థలాల్లో చాలా చోట్ల బినామీలున్నారు.
విచారించి ఆరు నెలలు.. చర్యలకు ఎన్నాళ్లో!
కంచరాం జగనన్న లేఅవుట్‌లో బినామీల కథలు
ప్రలోభపెట్టి ఇంకొన్ని స్థలాలు స్వాధీనం
దర్యాప్తులో గుర్తించిన విజిలెన్స్ అధికారులు
ఇంతవరకూ కానరాని చర్యలు
రాజాం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఇళ్లు కాదు.. ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తామని చెప్పారు. జగనన్న కాలనీల పేరుతో భారీ లేఅవుట్లు వేశారు. పట్టణాల్లో లబ్ధిదారులకు సెంటు భూమి చొప్పున అందించారు. అయితే పేదలకంటే నేతలే అప్పట్లో లబ్ధి పొందారు అన్నది బహిరంగ రహస్యం. ఆ ఇళ్ల స్థలాల్లో చాలా చోట్ల బినామీలున్నారు. ఆపై ప్రలోభాల పర్వం కూడా నడిచింది. రాజాం మునిసిపాల్టీకి సంబంధించి కంచరాం లేఅవుట్‌లో పేదలను భయపెట్టి కొంతమంది కారుచౌకగా ఇళ్ల స్థలాలను చేజెక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆరు నెలల కిందట చేపట్టిన విజిలెన్స్ విచారణలోనూ ఈ విషయం తేలింది. ప్రభుత్వానికి నివేదిక అందింది. కానీ ఇంతవరకూ చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో కేటాయించిన జగనన్న కాలనీ లేఅవుట్లలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ సాగింది. అందులో రాజాంలో భారీగా అక్రమాలు జరిగినట్టు విచారణ బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. రాజాం మునిసిపాల్టీకి సంబంధించి 70 నుంచి 100 వరకూ ఇళ్ల స్థలాలు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాజాం మునిసిపాల్టీ పరిధిలో నిరుపేదలకు కంచరాం సమీపంలో జగనన్న కాలనీ లేఅవుట్ ఏర్పాటుచేశారు. దాదాపు 1400 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే తక్కువ స్థలం కేటయించడంతో చాలామంది ఇళ్లు కట్టేందుకు మొగ్గుచూపలేదు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు అప్పటి అధికార పార్టీ ముసుగులో బినామీలుగా అవతారమెత్తారు. ఆసక్తి చూపని వారికి రకరకాల ప్రలోభాలు పెట్టి పట్టాలను తీసుకున్నారు. సెంటు స్థలాన్ని రూ.60వేలకు కొనుగోలు చేసుకున్నారు. తరువాత అదే స్థలంలో, అదే లబ్ధిదారుడి పేరిట ప్రభుత్వం నుంచి రూ.1.80 లక్షలు పొంది ఇళ్లు కట్టుకున్నవారూ ఉన్నారు. ఈ కాలనీ లేఅవుట్‌లో 70 నుంచి 100 వరకూ ఇదే మాదిరిగా చేతులు మారినట్టు తెలుస్తోంది. రాజాం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు ధర లక్షల్లో పలుకుతుండగా.. ఇక్కడ మాత్రం పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ.60 వేలు ముట్టచెప్పి ఇంటి స్థలాన్ని కైవసం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అప్పట్లో ఉండే అధికారులు, సిబ్బంది సైతం చేతివాటానికి పాల్పడ్డారని విజిలెన్స్ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. దీంతో బినామీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసలు లేఅవుట్‌లో కనీస వసతులు లేవు. అప్పట్లో వసతులు కల్పించకపోవడానికి ప్రధాన కారణం అప్పటి నేతలేనని చెప్తారు. వసతులు కల్పిస్తే లబ్ధిదారులు స్థలాలు వదులుకునేందుకు ఇష్టపడరు కాబట్టి అప్పట్లో పనులకు మోకాలడ్డినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ ముగిసింది. కానీ చర్యలు లేవు.
నివేదికలు వెళ్లాయి
లేఅవుట్లలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు జరిగిన మాట వాస్తవమే. అక్కడ జరిగిన వ్యవహారంపై ఆరా చేశారు. వివరాలు సేకరించారు. ప్రభుత్వానికి నివేదికలు అందించారు. ప్రభుత్వమే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎం.రాజశేఖర్, తహసీల్దారు, రాజాం