Share News

How is the Kharif season ? ఖరీఫ్‌ ఎలా?

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:34 AM

How is the Kharif season over come? ఖరీఫ్‌ సీజన్‌ కలిసివస్తుందా... నాట్లుకు పూర్తిస్థాయి తడి ఇవ్వగలమా.. చెరువుల్లో నీళ్లు చేరతాయా.. ఈ ప్రశ్నలకు కష్టమేనన్న సమాధానం రైతుల నుంచి వినిపిస్తోంది.

How is the Kharif season ? ఖరీఫ్‌ ఎలా?
గజపతినగరం: పాతబగ్గాం సమీపంలో నెర్రెలిచ్చిన వరి పొలం

ఖరీఫ్‌ ఎలా?

ఎండుతున్న వరి నాట్లు

కానరాని వర్షాలు

చెరువుల్లోనూ చేరని నీళ్లు

అయోమయంలో రైతులు

ఖరీఫ్‌ సీజన్‌ కలిసివస్తుందా... నాట్లుకు పూర్తిస్థాయి తడి ఇవ్వగలమా.. చెరువుల్లో నీళ్లు చేరతాయా.. ఈ ప్రశ్నలకు కష్టమేనన్న సమాధానం రైతుల నుంచి వినిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈఖరీఫ్‌ సీజన్‌ కరువును తలపిస్తోంది. నారుమళ్లు ముదురుపోయి ఎండ వేడికి తట్టుకోలేక మాడిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నాట్లు వేసినప్పటికీ ఎండల తీవ్రతకు కొద్దిరోజుల్లోనే పంటపొలాలు ఎండిపోయాయి. ఆ తర్వాత తడి లేక నేలలు నెర్రెలిస్తున్నాయి. సెప్టెంబరులో అయినా వరుణుడు కరుణిస్తాడేమోనని కాస్త ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

గజపతినగరం/రామభద్రపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి):

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఆదినుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. నారు ముదురుపోతుందనే భయంతో చిన్నపాటి వర్షాలకే నాట్లు వేశారు. తీరా వర్షాలు అనుకూలించక వరి నాట్లు నీరశిస్తున్నాయి. చాలా చోట్ల ఎండిపోతున్నాయి. చెరువుల్లో కూడా నీరు లేక వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు నెల వచ్చి వారం అయిపోతున్నా అయోమయ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌పై ఆశలు వదులుకుంటున్నామని కొందరు రైతులు వాపోతున్నారు. గజపతినగరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు మెంటాడ మండలాలకు సంబంధించి 50 శాతం వరినాట్లు వేసిన రైతులు చెరువుల్లో నీరు లేక బోరు బావుల్లో నుంచి నీరు రాక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

- జిల్లాలో వరిపంట సాధారణ విస్తీర్ణం లక్షా 255 హెక్టార్లు కాగా ఇప్పటివరకు సుమారు 40 వేల హెక్టార్లలో మాత్రమే వరి పంట సాగులో ఉంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు 482.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 290.1 వర్షపాతం మాత్రమే నమోదైంది. సెప్టెంబరులో అయినా వర్షాలు పడతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు ఏటా లక్షల రూపాయల మదుపులు పెట్టినప్పటికీ పంట చేతికి రాకపోవడంతో నిరాశ పడుతున్నారు. కొందరైతే పంట విరామం పాటిస్తున్నారు.

- ఈ ఏడాది జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి డివిజన్‌లలో సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పశుసంవర్దకశాఖ సంయుక్తంగా సూక్ష్మ బిందు వ్యవసాయంపై చైతన్యవంతం చేస్తున్నారు. తక్కువ నీటితో పండే మినుము, పెసలు, రాగి పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:34 AM