Share News

తాగునీరు ఎలా?

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:26 AM

బొబ్బిలి మునిసిపాలిటీ ప్రజలకు ఇప్పటి నుంచే టెన్షన్‌ పట్టుకుంది. ముందుముందు తాగునీరు అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

తాగునీరు ఎలా?
బొబ్బిలి మునిసిపాలిటీకి తాగునీటిని అందించే వేగావతి నది ఇలా..

బొబ్బిలి మునిసిపాలిటీ ప్రజలకు ఇప్పటి నుంచే టెన్షన్‌ పట్టుకుంది. ముందుముందు తాగునీరు అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. నీటి సరఫరా లేకుంటే ఏం చేయాలని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. వేగావతి నది ఎండుతుండడం.. ప్రస్తుతం రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తుండడంతో భవిష్యత్‌ను తలుచుకుని కలవరపడుతున్నారు. ఇంతో అంతో పెద్దగెడ్డ నీరే శరణ్యం అవుతోంది. వేసవిలో ప్రత్యామ్నాయం కోసం మునిసిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

బొబ్బిలి, మార్చి 2(ఆంధ్రజ్యోతి)

బొబ్బిలి ప్రజలకు వేగావతి నదిలో భోజరాజపురం వద్దనున్న ఊటబావుల నుంచి పంపింగ్‌ చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నది ఎండిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి నుంచే ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నదిలో అంతకంతకూ నీరు తరిగిపోతోంది. ఇప్పటికే కుళాయిల ద్వారా రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మూడు నెలలకు పైగా వేసవి కాలంలో ప్రజలకు తాగునీటిని అందించడానికి అవసరమైన ప్రత్యామ్నాయం కోసం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వేసవిలో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ నీరే బొబ్బిలి, సాలూరు పట్టణాల ప్రజలకే కాకుండా గ్రామీణ తాగునీటి పథకాలకూ ఆధారంగా ఉంటోంది. అక్కడి నుంచి ఏటా మాదిరిగా కొంత నీటిని వేగావతి నదిలోకి విడిచిపెట్టారు. నదిలో ఇసుక బస్తాలతో ఓ వైపు అడ్డుకట్ట వేసి ఊటబావుల్లోకి నీరు చేరేలా చర్యలు తీసుకున్నారు.

- వేగావతి నది నుంచి బొబ్బిలి పట్టణం, మండలంలోని తాగునీటి పథకాలకు, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల తాగునీటి పథకాలకు, అలాగే రైతులకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. నది ఎండిపోతుండడంతో రైతులకు రబీ సీజన్‌లో సాగునీరు లేనట్లే. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బోరు బావులకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. తాగునీటికి తొలి ప్రాధాన్యం కల్పిస్తూ వేగావతి నది నీటిని పొదుపు చేసి తాగునీటి పథకాలకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- బొబ్బిలి పట్టణంలోని 31 వార్డుల ప్రజలకు ప్రతి రోజూ 8 ఎంఎల్‌డీ (80లక్షల లీటర్ల) నీరు అవసరం కాగా ప్రస్తుతం ప్రతీ రోజూ 5 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. అన్ని ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు రోజు విడిచి రోజు విడుదల చేస్తున్నారు. కాగా ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం యాడ్వర్స్‌ సీజనల్‌ గ్రాంటును స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చేది. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులకు చెల్లుచీటీ రాయడంతో ఆర్థిక సంఘం నిధులు, మునిసిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి తాగునీటి కోసం వెచ్చిస్తున్నారు.

- సుమారు వంద కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సువర్ణముఖి తాగునీటి పథకాన్ని గత ప్రభుత్వం అటకెక్కించింది. ఈ పథకం అంచనా విలువ రూ.25 కోట్లకు పెరిగింది. ఆగిపోయిన తాగునీటి పనులను పునః ప్రారంభించేందుకు ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

- తోటపల్లి ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తున్న వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని బొబ్బిలి పట్టణ తాగునీటి పథకానికి అనుసంధానం చేసే ప్రతిపాదనను అధికారులు తెరమీదకి తెచ్చారు. సువర్ణముఖి పథకం స్ధానంలో తోటపల్లి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా బొబ్బిలి ప్రజలకు తాగునీరందించాలన్నది లక్ష్యం. అలా అయితే పట్టణంలో ప్రత్యేకంగా ఓ సంప్‌ నిర్మించి అక్కడ నుంచి తోటపల్లి నీటిని రిజర్వాయర్లకు పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది.

- తాత్కాలికంగా పెద్దగెడ్డ నీరు, శాశ్వతంగా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా బొబ్బిలి ప్రాంత ప్రజల తాగునీరు అందించవచ్చునని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం

వేగావతి నదిలో భోజరాజపురం ప్రధాన వాటర్‌వర్క్స్‌కు తాగునీటి నిల్వలు సమృద్ధిగా చేరేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం. ఊటబావులకు నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేశాము. పెద్దగెడ్డ రిజర్వాయరులో నీటి నిల్వలు ఉన్నందున ప్రతి 15 రోజులకోసారి అక్కడ నుంచి నదిలోకి నీటిని విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరాం. తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఇంజనీరింగ్‌ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

-లాలం రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనరు, బొబ్బిలి

Updated Date - Mar 04 , 2026 | 12:26 AM