వేసవి గట్టెక్కెదెలా?
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:02 AM
జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తోంది.
- పార్వతీపురంలో తాగునీటి కష్టాలు
- మూలకు చేరుతున్న ట్యాంకర్లు
-ఎక్కడికక్కడే లీకవుతున్న పైపులైన్లు
పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. నిత్యం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోనెల రోజుల్లో పాలకవర్గం రద్దు కానుంది. దీంతో తాగునీటి సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం మొదలైంది. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరిగాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలోని 30 వార్డులకు తాగునీటిని ఎలా సరఫరా చేస్తారనే అనే ప్రశ్న తలెత్తుతుంది. దీంతో ఈ వేసవి గట్టెక్కెదెలా? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
సుమారు ఆరున్నర దశాబ్దాల కిందట పార్వతీపురం మునిసిపాలిటీ ఏర్పడింది. గ్రేడ్-1 మునిసిపాలిటీగా మారి 24ఏళ్లు అయింది. జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడై నాలుగేళ్లు కావస్తుంది. అయినా తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 55 వేల నుంచి 60 వేల మంది జనాభా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, అనాధికారికంగా 80 వేల జనాభా ఉన్నట్లు సమాచారం. పార్వతీపురం మునిసిపాలిటీగా మారిన 13 ఏళ్ల తరువాత గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని నాగావళి నది నుంచి పార్వతీపురం పట్టణం వరకు తాగునీటి పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పైపులైన్ ద్వారానే 30 వార్డులకు తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే, 50 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్ కావడంతో ఎక్కడికక్కడే లీక్‌లు ఏర్పడి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. వేసవిలో నాగావళి నదిలోని ఇన్‌ఫిల్టర్ బావుల్లోకి నీరు చేరకపోవడంతో వారం రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాకాలంలో కుళాయిల నుంచి బురద నీరు వస్తుంది. ఈ నీటిని తాగి ప్రజలు డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది తాగునీటి సరఫరా కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. 2008లో పార్వతీపురం మునిసిపాలిటీకి తోటపల్లి ప్రధాన పంప్ హౌస్ నుంచి రూ.8 కోట్లతో తాగునీటి పైప్‌లైన్‌ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. కానీ, పైప్‌లైన్ వినియోగం మాత్రం జరగడం లేదు. తాగునీటి ట్యాంకర్లు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నా ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైప్‌లైన్‌ల మరమ్మతులకు కోసం ఉపయోగించే ఎక్స్‌కవేటర్ కూడా మరమ్మతులకు గురైంది. ఈ విషయమై ఏఈలు అప్పారావు, సన్యాసిరావును వివరణ కోరగా ‘తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతాం. మరమ్మతులకు గురైన ట్యాంకర్లను బాగు చేస్తాం.’ అని తెలిపారు.