How do I travel from Vizianagaram? విజయనగరం నుంచి ప్రయాణమెలా?
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:29 AM
How do I travel from Vizianagaram? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు విద్యుత్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక చార్జింగ్ పాయింట్ల నిర్మాణం, విద్యుత్ నెట్‌వర్క్ పురోగతి సాధించే వరకూ భోగాపురం ఎయిర్‌పోర్టు మార్గంలో ఈ బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కన్పించడం లేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ప్రాథమిక వసతుల లేమి ప్రతిబంధకంగా మారింది.
విజయనగరం నుంచి ప్రయాణమెలా?
ఎయిర్‌పోర్టుకు ఇప్పట్లో ఎలక్ర్టిక్ బస్సులు లేనట్టే!
కానరాని ప్రత్యేక చార్జింగ్ పాయింట్లు
మౌలిక వసతులూ నిల్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు విద్యుత్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక చార్జింగ్ పాయింట్ల నిర్మాణం, విద్యుత్ నెట్‌వర్క్ పురోగతి సాధించే వరకూ భోగాపురం ఎయిర్‌పోర్టు మార్గంలో ఈ బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కన్పించడం లేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ప్రాథమిక వసతుల లేమి ప్రతిబంధకంగా మారింది.
విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి):
విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఏపీఎస్‌ఆర్టీసీ ఏకంగా 20 ప్రత్యేక ఎలక్ర్టిక్ ఏసీ ఏరో ఎక్స్‌ప్రెస్’లను అందుబాటులోకి తేవడంతో ప్రయాణికులకు రవాణా సులభతరం అయ్యింది. అయితే జిల్లా కేంద్రం విజయనగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఒక విద్యుత్ బస్సు కూడా లేదు. విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సెక్కి నాతవలస జంక్షన్‌లో దిగాలి. అక్కడి నుంచి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటోలు ఇతర క్యాబ్ వాహనాలు 300 నుంచి వెయ్యి వరకూ డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విమానాశ్రయానికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తుండడంతో టెర్మినల్ లోపలికి వెళ్లేందుకు ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలకు మరో 200 అదనంగా చెల్లించాల్సి వస్తోందంటున్నారు. దీంతో ఒక్కొక్క ప్రయాణికుడిపై రూ.1200కి పైగా అదనపు భారం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.
మౌలిక వసతుల లేమి శాపమా!
జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు, ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్ల లైన్లు లేకపోవడమే ఈ-బస్సులు రాకపోవడానికి ప్రధాన కారణంగా మారింది. చార్జింగ్ వసతులు సిద్ధం కాకపోవడంతో విజయనగరం ప్రాంతాల నుంచి భోగాపురానికి ప్రత్యేక బస్సులు నడపలేకపోతున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆ ప్రతిపాదనలకు గ్రహణం
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల పురోగతికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో స్థానిక ఆర్టీసీ అధికారులు విఫలమౌతున్నారన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి. చార్జింగ్ పాయింట్ల నిర్మాణం, నెట్‌వర్క్ పనులు వేగవంతం చేసేలా ఒత్తిడి చేయడం లేదు. ఇదే విషయాన్ని జిల్లా ప్రజారవాణాధికారి జి.వరలక్ష్మీ వద్ద ప్రస్తావించగా ఎలక్ర్టిక్ బస్సులకు ప్రతిపాదనలు పంపామని, అయితే ఎప్పటిలోగా వస్తాయో? తెలియదన్నారు.