విమానాశ్రయానికి వెళ్లేదెలా?
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:31 PM
భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది.
- త్వరలో ప్రారంభంకానున్న భోగాపురం ఎయిర్‌పోర్టు
- బస్సుల కనెక్టవిటీపై స్పష్టత కరువు
- ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా?
- ప్రత్యే సర్వీసులు నడిపితే మేలు
- భోగాపురంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు డిమాండ్
విజయనగరం రింగురోడ్డు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తోన్న ఈ ఎయిర్‌పోర్టు ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే, విమానాశ్రయానికి చేరుకునే ప్రజా రవణా వ్యవస్థపై మాత్రం ఇప్పటి వరకూ స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 160 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. స్త్రీశక్తి పథకం వచ్చిన తరువాత 64 శాతం బస్సులను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం విజయనగరం నుంచి భోగాపురానికి డైరక్టు బస్సు ఒక్కటి కూడా లేదు. శ్రీకాకుళం నుంచి వచ్చే బస్సులు నాతవలస జంక్షన్ వరకూ మాత్రమే వెళ్తాయి. అక్కడి నుంచి మరో వాహనం పట్టుకుని భోగాపురం వెళ్లాల్సిన దుస్థితి. పల్లెవెలుగు బస్సులు చింతపల్లి, తిప్పవలస రూట్లలో ఐదు ట్రిప్పులు నడుస్తున్నాయి. అవి కూడా నాతవలస జంక్షన్ వరకూ మాత్రమే వెళతాయి. ఇంత వరకూ భోగాపురం మండలానికే బస్సు కనెక్టవిటీ లేకపోతే, త్వరలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ విమనాశ్రయానికి బస్సుల కనెక్టవిటీ ఎలా వస్తుందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
ప్రత్యేక ఆర్టీసీ డిపోకు డిమాండ్
విమాన ప్రయాణికులు సాధారణంగా 2 నుంచి 3 గంటల ముందే విమనాశ్రయానికి చేరుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ బస్సులపై ఆధారపడితే, ట్రాఫిక్, రద్దీ కారణంగా సమయానికి చేరుకోవడం కష్టమవుతుంది. విజయనగరం నుంచి భోగాపురం వరకూ ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోలు, టాక్సీలపై వస్తే అధిక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేక ఎయిర్‌పోర్టు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న విజయనగరం, ఎస్.కోట ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడిపితే విమానాల షెడ్యూల్‌కి అనుగుణంగా 24 గంటలూ సేవలు నిర్వహించడం కష్టమవుతుందని అధికారులు కూడా అనధికారికంగా అంగీకరిస్తున్నారు. నిరంతరం సేవలు అందాలంటే విమానాశ్రయ సమీపంలోనే ప్రత్యేక ఆర్టీసీ డిపో లేదా ట్రాన్సిట్ హబ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. అదే విధంగా ప్రత్యేక ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి భోగాపురానికి ప్రతీ గంటకు సర్వీసు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచిస్తున్నారు.
ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతాం
జిల్లాకు 20 ఎలక్ట్రికల్ ఏసీ బస్సుల కోసం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కూర్మన్నపాలెం(విశాఖ) నుంచి పది బస్సులు, విజయనగరం, శ్రీకాకుళం నుంచి ఐదు చొప్పున బస్సులను భోగాపురానికి త్వరలో నడపనున్నాం. విమానాశ్రయానికి అనుగుణంగా రవాణా అంశాలపై ఇప్పటికే ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నాం. భోగాపురం ప్రత్యేక డిపో, ఎలక్ట్రికల్ బస్సుల అంశాలు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు లోబడి ఉంటాయి. విమాన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడతాం,
-జి.వరలక్ష్మి, జిల్లా ప్రజారవాణాధికారి, విజయనగరం