Share News

మ్యుటేషన్‌ పెట్టుకునేదెలా?

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:08 AM

భర్త ఏదైనా కారణంతో మరణిస్తే ఆయన నుంచి వారసత్వంగా వచ్చిన భూములను భార్య పేరున మార్చాలంటే ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌(ఎఫ్‌ఎంసీ) ఆధారంగా మీసేవలో మ్యుటేషన్‌ దరఖాస్తు చేసుకోవాలి.

మ్యుటేషన్‌ పెట్టుకునేదెలా?

- ఏపీ సేవ పోర్టల్‌లో ఎఫ్‌ఎంసీ ఆప్షన్‌ తొలగింపు

- అవస్థలు పడుతున్న రైతులు

- గత పది రోజులుగా ఇదే సమస్య

విజయనగరం, కలెక్టరేట్‌ జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): భర్త ఏదైనా కారణంతో మరణిస్తే ఆయన నుంచి వారసత్వంగా వచ్చిన భూములను భార్య పేరున మార్చాలంటే ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌(ఎఫ్‌ఎంసీ) ఆధారంగా మీసేవలో మ్యుటేషన్‌ దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి భూములను భార్య పేరున మార్పు చేస్తారు. అయితే, గత పది రోజుల నుంచి ఏపీ సేవ పోర్టల్‌లో ఎఫ్‌ఎంసీ ద్వారా మ్యుటేషన్‌ పెట్టుకునే ఆప్షన్‌ను తొలగించారు. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. సాధారణంగా భూము లను ఒకరి నుంచి మరొకరి పేరున మార్పు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఎవరైనా భూమిని కొనుగోలు చేసుకుని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాల యంలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అప్పుడు అక్కడే ఆటో మ్యుటేషన్‌ అవుతుంది. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా నేరుగా కొనుగోలు చేసుకున్న వ్యక్తి పేరున భూములు మారుతాయి. రెండో విధానం ప్రకారం ఇంటిలో తల్లిదండ్రులు మరణిస్తే వారిని నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని పిల్లల పేరున మార్చాలంటే ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ ప్రకారం మార్పు జరుగుతుంది. దరఖాస్తు చేయనున్న వ్యక్తి ముందుగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ, మీసేవ కేంద్రాల్లో ఏపీ సేవ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తుదారుని ఆధార్‌ నెంబరుకు లింకైన ఫోన్‌ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు నమోదు చేసుకున్న తరువాత ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ నెంబరును ఎంటర్‌ చేస్తే మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో ఓపెన్‌ అవుతాయి. వారసులు దరఖాస్తు చేసుకున్న తరువాత ఆయా పత్రాలను రెవెన్యూ అధికారులకు ఇస్తే వారు పరిశీలించి ఆన్‌లైన్‌లో పేర్లు మారుస్తారు. అయితే, ఏపీ సేవ పోర్టల్‌లో ఈ ఆప్షన్‌ గత పది రోజుల నుంచి లేకపోవడంతో రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రతి రోజూ మీసేవ కేంద్రాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ముటేషన్‌కు ఎఫ్‌ఎంసీ ఆప్షన్‌ ఇవ్వాలంటూ రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:08 AM