How did they make that payment? అలా ఎలా చెల్లించేశారు?
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:18 AM
How did they make that payment? బొబ్బిలి సబ్ ట్రెజరీ కార్యాలయం ద్వారా పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు చెల్లింపులు జరిగినట్లు వెలుగు చూసింది. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 51 మందికి రూ.కోటి వరకు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలా ఎలా చెల్లించేశారు?
రిటైర్డ్ ఉద్యోగులకు అక్రమ చెల్లింపులు
గుర్తించిన విజిలెన్స్ అఽధికారులు
51 మందికి రూ. కోటి వరకు అందినట్టు ఆరోపణలు
మండల పరిషత్ రిటైర్డ్ ఉద్యోగి నుంచి తాజాగా రికవరీ
పోలీసు ఫిర్యాదులు.. నోటీసుల జారీ తంతు సాగుతున్న వైనం
బొబ్బిలి సబ్ ట్రెజరీ కార్యాలయం ద్వారా పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు చెల్లింపులు జరిగినట్లు వెలుగు చూసింది. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 51 మందికి రూ.కోటి వరకు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు. మండల పరిషత్ రిటైర్డ్ ఉద్యోగి నుంచి తాజాగా రికవరీ కూడా చేశారు. ఈ క్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసే తంతు ప్రస్తుతం సాగుతోందని తెలుస్తోంది. కొందరి విషయంలో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.
బొబ్బిలి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది అడ్డుగోలుగా చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ పరిధిలో 2023లో రిటైర్డ్ అయిన ఓ ఉద్యోగికి రెండు దఫాలు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సుమారు రూ.5 లక్షల మేర అందాయని నిర్ధారణ అయ్యాక ఆ సొమ్ము రికవరీకి చర్యలు తీసుకున్నారు. అయితే ఈ సొమ్ము రికవరీ కోసం రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి వారం క్రితం ఎస్‌టీవో పీవీ పద్మనాభం వెళ్లగా ఆ కుటుంబ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఎస్‌టీవో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ చెల్లింపులకు సంబంధించి ఎంపీడీఓ పి.రవికుమార్ వెంటనే స్పందించి ఆ రిటైర్డ్ ఉద్యోగి నుంచి సుమారు రూ.2.50 లక్షలను రికవరీ చేసి తిరిగి ఖజానాకు జమ చేయించారు. ఇదిలా ఉండగా అన్ని ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్రమ చెల్లింపులకు ఎలా ఆస్కారం ఏర్పడుతోందో అంతు చిక్కడం లేదు. అయితే బొబ్బిలి సబ్‌ట్రెజరీ కార్యాలయంలో గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది సుమారు 51 మందికి కోటి రూపాయల వరకు అక్రమ చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ము రికవరీ కోసం అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
అదనపు చెల్లింపులు వాస్తవమే
పీవీ పద్మనాభం, ఎస్‌టీఓ, బొబ్బిలి
బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయంలో ఓ రిటైర్డ్ ఉద్యోగికి రెండు దఫాలు చెల్లింపులు జరిగిన మాట వాస్తవమే. విజిలెన్స్ హెచ్చరికల ద్వారా ఈ సొమ్ము రికవరీకోసం ఆ వ్యక్తి ఇంటికి వెళితే వారు నన్ను తీవ్రంగా శాపనార్థాలు పెట్టారు. అక్రమ చెల్లింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక షోకాజ్ నోటీసు కూడా ఇచ్చాను. ఈ విధంగా 51 మంది వరకు రిటైర్డ్ ఉద్యోగులకు సుమారు కోటి రూపాయల మేర చెల్లింపులు జరిగాయి. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రికవరీకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మృతి చెందిన పెన్షనర్ల పేర వారి అకౌంట్ల నుంచి అక్రమంగా పెన్షన్ డ్రా చేస్తున్న వాటిని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాం.
రికవరీ చేసి అధికారులకు నివేదించాం
పి.రవికుమార్, ఎంపీడీవో, బొబ్బిలి
మా కార్యాలయంలో 2023లో పదవీ విరమణ చేసిన ఉద్యోగి సంపాదిత సెలవు తదితర బెనిఫిట్స్‌కు సంబంధించి రెండు దఫాలు చెల్లింపులు జరిగిపోయిన మాట వాస్తవమే. విజిలెన్స్ గుర్తించిన వెంటనే అతని నుంచి రికవరీ చేసి ఆ మొత్తాన్ని వాపస్ చేశాం. ఇందుకు సంబంధించిన చలానాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ తరహా చెల్లింపులపై విజిలెన్స్ అప్రమత్తం చేయడం పరిపాటి. వెంటనే రికవరీ చర్యలు తీసుకున్నాం.
---------------