Roads? రాళ్లు తేలిన దారుల్లో రాకపోకలు ఎలా?
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:26 AM
How Can Traffic Move on Stone-Strewn Roads? సీతంపేట ఏజెన్సీలో గిరిజనులకు రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి. రాళ్లు తేలి ఛిద్రమైన దారుల్లో రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు.
నిధులున్నా.. ప్రారంభం కాని పనులు
పెరిగిపోయిన నిర్మాణ సామగ్రి ధరలు
గిరిజనులకు తప్పని ఇక్కట్లు
సీతంపేట రూరల్, జూన్10(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిజనులకు రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి. రాళ్లు తేలి ఛిద్రమైన దారుల్లో రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ముడి సరుకుల ధర పెరిగిపోవడమే ఇందుకు కారణం. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు.
ఇదీ పరిస్థితి..
- సీతంపేట ఏజెన్సీలో గిరిశిఖర గ్రామాలైన కోపువలస జంక్షన్ - వంబరెల్లి, కోడిశ - కుమ్మరిగండి వయా ఓండ్రుజోల, కడగండి జంక్షన్- బొమ్మిక గ్రామానికి వెళ్లే రహదారులు పూర్తిగా ఛిద్రమయ్యాయి. రాళ్లు తేలిన ఈ దారుల్లో 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. తప్ప నిసరి పరిస్థితులో గిరిపుత్రులు ఆ మార్గాల గుండా రాకపోకలు సాగిస్తున్నారు. విద్య, వైద్యంతో పాటు వారపుసంతలకు అటవీ ఉత్పత్తుల తరలింపు సమయాల్లో నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర వేళల్లో వారికి డోలీ మోతలు తప్పడం లేదు. నిధులున్నా.. ఈ రెండు రోడ్డు పనులు సాగకపోవడంపై గిరిపుత్రులు మండిపడుతున్నారు.
- కోడిశ జంక్షన్ - గుడ్డిమీదగూడ మీదుగా ఓండ్రుజోల, కడగండి జంక్షన్ నుంచి బొమ్మిక వరకు 9కిలోమీటర్ల మేర బీటీ రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గత ఏడాది సాస్కి(ఎస్‌ఏఎస్‌సీఐ)నిధులు రూ.3కోట్లు మంజూరుచేసింది. అయితే పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
- ఉపాధి నిధులు రూ.3కోట్లతో 2022లో (వైసీపీ హయాంలో) కోపువలస జంక్షన్-వంబరెల్లి వరకు 3.8 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ రహదారి మధ్యలో 800 మీటర్ల వరకు సీసీ రహదారి నిర్మాణ పనులు పూర్తికాగా మిగిలిన చోట జీఎస్‌బీ, వెట్‌మిక్స్ వేసి వదిలేశారు. మొత్తంగా నాలుగేళ్లు కావస్తున్నా ఇంతవరకు గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయింది. దీంతో దారిపోడవునా భారీ గుంతలు ఏర్పడ్డాయి.
నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలు
బీటీ రహదారులకు వినియోగించే ముడిసరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో నిర్మా ణంపై ఆప్రభావం పడింది. టన్ను తారు ధర గతంలో రూ.45వేలు ఉండగా ప్రస్తుతం రూ.75వేలకు చేరింది. జీఎస్‌బీ, వెట్‌మిక్స్ ధరలు కూడా నింగినంటాయి. వాటికీ డిమాండ్ పెరగడంతో పనులు సకాలంలో ప్రారంభం కావడం లేదు. ఏదేమైనప్పటికీ త్వరలో ఈ పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిశిఖర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పనులు ప్రారంభిస్తాం
‘కోడిశ జంక్షన్ - ఓండ్రుజోల, కడగండి జంక్షన్ - బొమ్మిక వరకు ఉన్న రహదారి పూర్తిగా పాడైన మాట వాస్తవమే. ఈ రహదారి నిర్మాణానికి నిధులు ఉన్నాయి. త్వరలో పనులు ప్రారంభి స్తాం. ’అని ఆర్‌అండ్‌బీ డీఈ జగన్నాథరావు తెలిపారు.
టీడబ్ల్యూ డీఈ ఏమన్నారంటే..
‘కోపువలస జంక్షన్ నుంచి వంబరెల్లి వరకు రహదారి నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు చేపడతాం. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు త్వరలో ప్రారంభించేలా చూస్తాం.’ అని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డీఈ నాగభూషణం తెలిపారు.