Share News

Drink Contaminated Water కలుషిత నీరు తాగేదెలా?

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:19 PM

How Can People Drink Contaminated Water? పంచాయతీల్లో రక్షిత నీటి పథకాల నిర్వహణ ఎవరికీ పట్టడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకు ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాల్సి ఉంది. కానీ చాలా పంచాయతీల్లో అలా జరగడం లేదు.

Drink Contaminated Water కలుషిత నీరు తాగేదెలా?
ఈ బావి నీటినే వినియోగిస్తున్న చినమేరంగి గ్రామ ప్రజలు

  • ప్రజల ప్రాణాలతో చెలగాటం

  • ఎవరీకి పట్టని రక్షిత నీటి పథకాల నిర్వహణ

  • 15 రోజులకొకసారి ట్యాంకులను శుభ్రం చేయని వైనం

  • కానరాని క్లోరినేషన్‌ చర్యలు.. కొరవడిన పర్యవేక్షణ

  • ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పారిశుధ్య లోపం

  • రోగాలతో పల్లెవాసులు సతమతం

జియ్యమ్మవలస, జూలై13(ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో రక్షిత నీటి పథకాల నిర్వహణ ఎవరికీ పట్టడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకు ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాల్సి ఉంది. కానీ చాలా పంచాయతీల్లో అలా జరగడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది.. నిబంధ నలు గాలికొదిలేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలు, పంచాయతీ ప్రత్యేకాధికారుల కూడా పర్యవేక్షించడం లేదు. ఫలితంగా కలుషిత నీరు, పారిశుధ్య లోపం కారణంగా పల్లెవాసులు వ్యాధులతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

ఇదీ పరిస్థితి ..

- జిల్లాలో 15 మండలాలు, 451 పంచాయతీలు, వాటి పరిధిలో 2,282 గ్రామాలు ఉన్నాయి. కమ్యూనిటీ పబ్లిక్‌ వాటర్‌ సప్లై (సీపీడబ్ల్యూఎస్‌) స్కీములు 11, రక్షిత నీటి పథకాలు (పీడబ్ల్యూఎస్‌) 794, మినీ ప్రొటెక్టెడ్‌ వాటర్‌ స్కీమ్‌ (ఎంపీడబ్ల్యూఎస్‌)లు 471, సోలార్‌ నీటి పథకాలు 395, డైరెక్ట్‌ పంపింగ్‌లు 1,675, సోలార్‌ హోమ్‌ పంపింగ్‌ సిస్టం (ఎస్‌హెచ్‌పీఎస్‌)లు 7,217 ఉన్నాయి. వాటి ద్వారా 8,87,332 కుటుంబాలకు తాగునీరు అందుతుంది. 1.64 లక్షల కుటుంబాలకు ఇంటి కనెక్షన్లు ఉన్నాయి. అయితే చాలాచోట్ల రక్షిత నీటి పథకం ట్యాంకులు నాచు పట్టి దారుణంగా తయారయ్యాయి. దీంతో నీరు కలుషితమవుతుండడంతో పంచాయతీ ప్రజలు పలు రకాల రోగాలతో అల్లాడుతున్నారు. ఇక ప్లాస్టిక్‌, పాలిథిన్‌ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. ఈ వ్యర్థాలతో పంచాయతీ పరిసరాలు దారుణంగా దర్శనమిస్తున్నా.. స్పందించే వారే కరువయ్యారు.

- జియ్యమ్మవలస మండలం చినమేరంగి మేజర్‌ పంచాయతీకి సమీపంలో స్వామినాయుడు చెరువు పక్కనే నేల బావి ఉంది. దీని ద్వారానే చినమేరంగి ప్రజలకు తాగునీరందుతోంది. కానీ ఈ నేల బావి నాచు పట్టి, రెల్లి పొదలు నిండి దారుణంగా తయారైంది. పంపింగ్‌ లైనింగ్‌ అంతా కంపుకొడుతోంది. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుషిత నీటినే వినియోగించాల్సి వస్తోంది.

- కురుపాంలో దొనకవీధి పక్కనే ఉన్న రక్షిత నీటి పథకం చుట్టూ పారిశుధ్యం లోపించింది. క్లోరినేషన్‌ కూడా చేపట్టడం లేదు. కొన్ని వీధుల్లో మురుగు కాలువల్లోనే పైపులు ఉండడం వల్ల మురుగు నీరు తాగునీటిలో కలిసిపోతోంది.

- వీరఘట్టంలో ఉన్న రక్షిత నీటి పథకం ట్యాంకు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేశారనే వివరాలు అక్కడి ట్యాంకు గోడలపై కనిపించడం లేదు. ఈ గ్రామస్థులకు కూడా కలుషితే తాగునీరే అందుతోంది.

- కొమరాడ మండలంలోని పలు పంచాయతీల్లో రక్షిత నీటి పథకాల పరిస్థితి దారుణంగా ఉంది. క్లోరినేషన్‌, శుభ్రత లేక ప్రజలు కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

- జియ్యమ్మవలస మండలంలో చినమేరంగి నుంచి అల్లువాడకు వెళ్లే చెరువు గట్టు దారి పాలిథిన్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయింది. పట్టించుకునే వారే లేని పరిస్థితి. పలు చోట్ల వీధి లైట్లు లేక.. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నిధులేమైనట్లు..

జిల్లా వ్యాప్తంగా 451 పంచాయతీలకు గాను ప్రభుత్వం అందించిన 15వ ఆర్థిక సంఘం నిధులు, తలసరి గ్రాంట్లు సుమారు రూ. 13.14 కోట్లు అందుబాటులో ఉండేవి. అయితే ఈ నిధులు పూర్తిగా ఖర్చయిపోయినట్లు లెక్కలు చూపుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో నిధులు లేవని భోగట్టా.

చర్యలు తీసుకుంటాం

మండలంలో రక్షిత నీటి పథకాల ట్యాంకుల శుభ్రత , క్లోరినేషన్‌కు చర్యలు తీసుకుంటాం. పారిశుధ్య మెరుగు పనులు చేపడతాం.

- హరిప్రసాద్‌, ఎంపీడీవో, జియ్యమ్మవలస

Updated Date - Jul 13 , 2026 | 11:19 PM