Share News

రూ.10వేలతో ఎలా?

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:51 PM

జంఝావతి పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రూ.10వేలతో ఎలా?
పూర్తికాని జంఝావతి ప్రాజెక్టు

- బడ్జెట్‌లో ‘జంఝావతి’కి స్వల్ప కేటాయింపు

- పనుల పూర్తిపై రైతుల్లో ఆందోళన

పార్వతీపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): జంఝావతి పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టును పూర్తి చేయడంటూ కేవలం వినతిపత్రాలు అందించి చేతులు దులుపుకుంటున్నారే తప్పా నిధుల కోసం పట్టుబట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంఝావతిని పూర్తి చేసేందుకు కోట్ల రూపాయల నిధులు అవసరం. కానీ, కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.10వేలనే ఈ ప్రాజెక్టుకు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్టు పరిస్థితి..

కొమరాడ మండలంలో ఉన్న జంఝావతి ప్రాజెక్టు పరిధిలో ఎగువ, దిగువ కాలువలు ఉన్నాయి. 27,790 కిలో మీటర్ల పొడవు ఉన్న ఎగువ కాలువ ద్వారా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని 12వేల ఎకరాలకు, 26.925 కిలో మీటర్ల పొడువున దిగువ కాలువ ద్వారా గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, సీతానగరం మండలాల్లోని 12 వేల ఎకరాలకు మొత్తంగా 24 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ, కేవలం 9 వేల ఎకరాలకే సాగునీరు అందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు కాలువల పరిధిలో మదుముల వద్ద షట్టర్లు లేకపోవడం, పిల్ల కాలువలను తవ్వకపోవడం, కొన్ని చోట్ల యూటీలు నిర్మించకపోవడం, గుర్రపు డెక్క, పూడికలు పేరుకుపోవడం తదితర కారణాలతో సాగునీరు ముందుకు సాగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు అవరమైన పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అరకొర నిధులు కేటాయించడంతో పూర్తిస్థాయిలో పనులు జరగక శివారు భూములకు సాగునీరందడం లేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.10వేలే కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పది వేల రూపాయలతో ఏ పనులు చేయాలో అధికారులకు అర్ధంకావడం లేదు. దిగువ కాలువ నుంచి ఎగువ కాలువకు నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరమ్మతులకు గురైనజనరేటర్‌ నేటికీ మెకానిక్‌ వద్దేఉండిపోయిందంటే ప్రాజెక్టు పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనుల పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం:

జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు రూ.54 కోట్లు అవసరం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా 9 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం.

-ఢిల్లేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, జంఝావతి ప్రాజెక్టు..

Updated Date - Feb 16 , 2026 | 11:51 PM