Share News

house tax target reach అనుకున్నారు.. రాబట్టారు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:16 AM

house tax target reach పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుకు ఈసారి పంచాయతీరాజ్‌ విభాగం పెద్ద కసరత్తే చేసింది. కార్యదర్శులకు టార్గెట్‌ విధించింది. నిత్యం పర్యవేక్షణకు మండల పరిషత్‌ అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులకు బాధ్యతలు అప్పగించింది.

house tax target reach అనుకున్నారు.. రాబట్టారు
శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ కార్యాలయం

అనుకున్నారు.. రాబట్టారు

జిల్లాలో రికార్డు స్థాయిలో ఇంటి పన్ను వసూలు

రూ.31.96 కోట్లకుగాను రూ.28.19 కోట్లు రాక

శతశాతం దిశగా 655 గ్రామ పంచాయతీలు

మేజర్‌ పంచాయతీల్లోనూ గతం కంటే మెరుగు

పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుకు ఈసారి పంచాయతీరాజ్‌ విభాగం పెద్ద కసరత్తే చేసింది. కార్యదర్శులకు టార్గెట్‌ విధించింది. నిత్యం పర్యవేక్షణకు మండల పరిషత్‌ అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. వెనకబడిన కార్యదర్శులను గుర్తించి మెమోలు జారీ చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు రాత్రీపగలు అన్న తేడా లేకుండ పనిచేశారు. శతశాతానికి దగ్గరగా పన్నులు వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.31.96కోట్లకు గాను రూ.28.19 కోట్లు రాబెట్టారు.

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి):

వేపాడ మండలం ఆకుల సీతంపేట పంచాయతీలో రూ.93,394, జగ్గయ్యపేట పంచాయతీలో రూ.1,48,832, అరిగిపాలెం పంచాయతీలో రూ.66.217లు చొప్పున ఇంటిపన్ను వసూలు చేయాలి. ఈ మూడింటా పంచాయతీ అధికారులు శతశాతం పన్ను వసూలు చేశారు. ఇలా జిల్లాలోని 777 పంచాయతీల్లో 655 చోట్ల శత శాతం ఇంటి పన్ను వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు.

వంగర, బాడంగి, రేగిడి, సంతకవిటి, వేపాడ, మెంటాడ, పూసపాటిరేగ, దత్తిరాజేరు తదితర మండలాల్లో రూ.కోట్ల డిమాండ్‌కు రూ.వేలల్లో మాత్రమే బకాయిలు కనిపిస్తున్నాయి. మేజర్‌ పంచాయతీల్లోనూ గతం కంటే మెరుగ్గా ఇంటి పన్ను వసూలు చేయగలిగారు. 50శాతం పైబడి వసూలు చేసేశారు. జిల్లాలో అతిపెద్ద పంచాయతీలుగా చలామణి అవుతున్న శృంగవరపుకోటలో రూ.264.48లక్షలకు రూ.186.07లక్షలు వసూలు కాగా రూ.78.41లక్షలు బకాయిలున్నాయి. కొత్తవలసలో రూ.276.51లక్షలకు రూ.198.94లక్షలు వసూలు చేయగా రూ.77.57లక్షల బకాయిలు ఉన్నాయి. చీపురుపల్లిలో రూ.145.65లక్షలకు రూ.112.30లక్షలు వసూలు చేశారు. రూ.33.34లక్షలు బకాయిలున్నాయి. పేరుకే పంచాయతీలుగా ఉన్న వీటిల్లో పట్టణాల్లో వున్న రీతిలో నివాసాలు ఉంటాయి. ఇళ్ల యజమానులు ఎక్కడో ఉంటారు. అద్దెకు వున్న కుటుంబాలు అత్యధికం. యజమానుల చిరునామాలు, ఫోన్‌ నెంబర్‌లు కూడా అద్దెకు వున్న కుటుంబ సభ్యులు ఇవ్వరు. దీనికితోడు గతంలో మాన్యువల్‌ పద్ధతిలో ఇంటిపన్నులు వసూలు చేశారు. ఇప్పుడు స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇంటి పన్నుల బకాయిలు లేవని, ఈ ఏడాదికి సంబంధించిన ఇంటిపన్నులు మాత్రమే చెల్లించాలని బుకాయించేవారున్నారు. అటువంటి వారికి గతంలో ఇంటిపన్ను కట్టలేదని పంచాయతీ సిబ్బంది రుజువులతో సహా చూపించాల్సి వస్తోంది. ఇలాంటివన్ని మేజర్‌ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుకు ఆటంకంగా మారాయి. ఇలాంటి ప్రతిబంధకాలన్నింటినీ దాటుకొని జిల్లాలో రూ.31.96కోట్ల ఇంటి పన్నులకు గాను రూ.28.19కోట్లు వసూలు చేయగలిగారు. కేవలం రూ.3.77 కోట్ల బకాయిలే ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ వీటిని వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు చూస్తున్నారు.

ప్రభుత్వ సంస్కరణలూ దోహదం

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పంచాయతీరాజ్‌ శాఖకు మంత్రిగా ఉప ముఖ్యమంత్రి కొణెదల వపన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. అనేక మార్పులు తీసుకువచ్చేందుకు యవ ఐఏఎస్‌ అధికారి కృష్ణ తేజను కార్యదర్శిగా నియమించుకున్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థలో పని చేస్తున్న అధికారులకు పదోన్నతులు కల్పించారు. ఆరు గ్రేడ్‌లుగా ఉన్న కార్యదర్శుల వ్యవస్థను మూడు గ్రేడ్‌లకు కుదించారు. పల్లెల్లో తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుధ్య నిర్వహణ వంటి వాటిని మెరుగుపరిచారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి మాత్రమే ఇంటి పన్నులు వసూలు జరుగుతున్నట్లు గుర్తించారు. ధనికులు, బడాబాబులు, రాజకీయ నాయకుల నుంచి కూడా ఇంటిపన్నులు వసూలు చేసేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. దాదాపు నాలుగు నెలల క్రితం నుంచి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు శత శాతం వసూలు చేయాలన్న గట్టి పట్టుదలను చూపించారు. అత్యధిక గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి ఇంటి పన్నును కట్టించగలిగారు. అనుకున్నట్లే శతశాతం సాధించగలిగారు.

Updated Date - Apr 07 , 2026 | 12:16 AM