hot hot meeting వాడీవేడిగా..
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:24 AM
hot hot meeting
వాడీవేడిగా..
సమస్యల ప్రస్తావనతో సాగిన జడ్పీ సమావేశం
అధికారులపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న జడ్పీ చైర్మన్
విజయనగరం టౌన్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. అనేక సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. అధికారులపై ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం సమావేశం మొదలైంది. కొద్దిసేపు చర్చ జరిగాక డ్వామా అధికారి శారదాదేవి మాట్లాడుతూ ఉపాధి పథకం గురించి వివరించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతికి తావులేకుండా పనులు జరుగన్నాయని చెబుతుండగా విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఉపాధిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. విజయనగరం ఎంపీడీవో ఉపాధి సిబ్బందితో కలిసి సుమారు రూ.48లక్షల విలువ చేసే పనులు చేయించకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అరుకు ఎంపీ తనూజారాణి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ఇస్తున్న రుణాలలో సున్నా వడ్డీ వర్తించడం లేదన్నారు. దీనిపై డ్వామా పీడీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. బొండపల్లి ఎంపీపీ చల్లంనాయుడు మాట్లాడుతూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనువాస్ తన గజపతినగరం నియోజకవర్గంలో కొంతమందికి ప్రత్యేకమైన నిబంధనలతో పింఛన్లు మంజూరుచేశారని ఆరోపించారు. డ్వామా పీడీ శారదాదేవి మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో జిల్లాలో ఎక్కడా నూతన పింఛను మంజూరుచేయలేదని, సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాకేంద్రంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని ప్రస్తావించగా స్పందించిన ఐసీడీఎస్ పీడీబాలామణి మాట్లాడుతూ తొందరలోనే కేంద్రాలను పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చివరిగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న మద్దతు ధర క్వింటాకు రూ.2400 ప్రకటించినప్పటికీ బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు తదితరులు పాల్గొన్నారు.
-------------