Hostels haven't filled up! హాస్టళ్లు నిండలే!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:20 AM
Hostels haven't filled up! సంక్షేమ వసతిగృహాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటినా సగం సీట్లు కూడా నిండలే. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల కేవలం 30 శాతం ప్రవేశాలే జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా సీట్లు ఎలా భర్తీ చేయాలోనని తలలు పట్టుకుంటున్నారు.
హాస్టళ్లు నిండలే!
బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో చేరని విద్యార్థులు
50 శాతం కూడా భర్తీ కాని ప్రవేశాలు
వసతులు లేకపోవడం, సిబ్బంది కొరతే కారణం
- రాజాం బీసీ బాలుర వసతిగృహంలో 100 మంది విద్యార్థులకు వసతికల్పించాలి. అక్కడ ఉన్నది కేవలం 63 మంది మాత్రమే. తగినంతగా వసతులు లేకపోవడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు.
- బొబ్బిలి మండలంలోని పిరిడీ బీసీ వసతిగృహంలో 100 మంది విద్యార్థులకుగాను ఉన్నది కేవలం 42 మంది మాత్రమే. హాస్టళ్లలో వసతులు లేకపోవడం, సిబ్బంది కొరతతో అక్కడ చేరేందుకు విద్యార్థులు ముందుకు రాలేదు.
రాజాం, జూలై 30(ఆంధ్రజ్యోతి):
సంక్షేమ వసతిగృహాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటినా సగం సీట్లు కూడా నిండలే. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల కేవలం 30 శాతం ప్రవేశాలే జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా సీట్లు ఎలా భర్తీ చేయాలోనని తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో బీసీ, ఎస్సీ వసతిగృహాలు కలిపి 78 వరకూ ఉన్నాయి. ఇందులో పాఠశాలలకు సంబంధించి 47, కాలేజీలకు సంబంధించి 31 వసతిగృహాలు ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి వసతిగృహంలో పాత, కొత్తగా చేరిన వారితో 100 మంది వరకు ఉండొచ్చు. గత ఏడాది గణాంకాలను పోల్చితే ఈ ఏడాది చేరికలు చాలా దారుణంగా తగ్గిపోయాయి. 50 శాతం కూడా అడ్మిషన్లు లేవని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీ వసతిగృహాల్లో 3,300 మంది విద్యార్థులకు వసతి అందించాల్సి ఉంది. గత ఏడాది విద్యార్థుల సంఖ్య 511 కాగా.. ఈ ఏడాది ఏకంగా 420 మందికి పడిపోయింది. ఎస్సీ వసతిగృహాలకు సంబంధించి 1600 సీట్లకుగాను గత ఏడాది 279 మంది చేరారు. ఈ ఏడాది అదనంగా 20 మంది చేరడం ఉపశమనం కలిగించే విషయం. కాగా హాస్టళ్లలో వసతులు లేకపోవడం, మరుగుదొడ్ల కొరత, తాగునీటి సదుపాయం లేకపోవడం వంటి కారణాలతోనే అడ్మిషన్లు తగ్గినట్టు తెలుస్తోంది. వీటికి తోడు వార్డెన్లు పూర్తిస్థాయిలో లేరు. సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెడితే కానీ.. ప్రభుత్వ వసతిగృహాలు మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు.
తగ్గిన మాట వాస్తవమే
వసతిగృహాల్లో ప్రవేశాలు తగ్గిన మాట వాస్తవమే. అయినా సరే పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే సరిచేస్తున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేపడుతున్నాం. విధుల్లో అలసత్వం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు.
- జ్యోతిశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, విజయనగరం