Share News

Horrific accident ఘోర ప్రమాదం

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:15 AM

Horrific accident తొమ్మిది రోజులపాటు భవానీ దీక్ష చేపట్టారు. నిష్ఠతో పూజలు చేశారు. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటామని బస్సులో బయలుదేరారు. ఇంట్లో వారికి వీడ్కోలు చెప్పి త్వరగా వచ్చేస్తామన్నారు. తెల్లారిన తర్వాత ఫోన్‌ చేస్తామన్నారు. ఇంతలోనే విధి వక్రించింది. బస్సు ఆగడంతో నలుగురు భవానీ దీక్షదారులు టీ తాగుదామని దిగి రోడ్డు దాటుతుండగా కారు రూపంలో వారిని మృత్యువు కబళించింది. రెక్కాడితే గానీ డొక్కాడని నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Horrific accident ఘోర ప్రమాదం
ప్రమాదానికి కారణమైనకారు, మృతులు రమణసత్తిబాబు(ఫైల్‌), ఎర్రయ్య(ఫైల్‌), సీతారాం(ఫైల్‌), శివప్రసాద్‌(ఫైల్‌)

ఘోర ప్రమాదం

అమ్మవారి దర్శనానికి వెళుతూ అనంతలోకాలకు

కారు ఢీకొని నలుగురు భవానీ మాలధారులు దుర్మరణం

బాధితులంతా డెంకాడ గ్రామస్థులు

కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలో ప్రమాదం

వీధిన పడిన నాలుగు కుటుంబాలు

కన్నీరుమున్నీరైన భార్య, పిల్లలు

తొమ్మిది రోజులపాటు భవానీ దీక్ష చేపట్టారు. నిష్ఠతో పూజలు చేశారు. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటామని బస్సులో బయలుదేరారు. ఇంట్లో వారికి వీడ్కోలు చెప్పి త్వరగా వచ్చేస్తామన్నారు. తెల్లారిన తర్వాత ఫోన్‌ చేస్తామన్నారు. ఇంతలోనే విధి వక్రించింది. బస్సు ఆగడంతో నలుగురు భవానీ దీక్షదారులు టీ తాగుదామని దిగి రోడ్డు దాటుతుండగా కారు రూపంలో వారిని మృత్యువు కబళించింది. రెక్కాడితే గానీ డొక్కాడని నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

డెంకాడ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): డెంకాడ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బోనెల రమణ సత్తిబాబు(52), సిరిగిడి ఎర్రయ్య (35), లింగాల సీతారాం(36), తాటిపూడి శివప్రసాద్‌(36)లు డెంకాడ భవానీ పీఠం వద్ద ఈ నెల 12న భవానీ దీక్ష చేపట్టారు. శరన్నవరాత్రులూ భక్తిప్రపత్తుల తో గడిపారు. గ్రామంలోని మిగతా 40 మంది స్వాములతో కలిసి అమ్మవారిని కొలిచారు. బుధవారం రాత్రి నిమజ్జనంలో కూడా భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ రాత్రి 12 గంటల వరకు కుటుంబ సభ్యుల వెంటే ఉన్నారు. అమ్మవారిని నిమజ్జనం చేశాక అదే గ్రామానికి చెందిన 35 మంది దీక్షదారులు, ఐదుగురు సాధారణ భక్తులు కనకదుర్గ దర్శనానికి విజయవాడకు ప్రైవేటు బస్సులో సుమారు ఒంటిగంట ప్రాంతంలో బయలుదేరారు. కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ బస్సు ఎక్కారు. గురువారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్దకు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న వాహనం మరమ్మతులకు గురైంది. దీంతో టీ తాగుదామని ఈ నలుగురు భక్తులు బస్సు దిగి రోడ్డు దాటుతున్నారు. ఈలోగా కారు ఢీకొంది. తోటి యాత్రికులు చూస్తుండగానే ముగ్గురు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి భవానీ భక్తులతో ఆ కారు వస్తోంది. అతివేగంగా వచ్చి ఢీకొనడంతో సంఘటనా స్థలం వద్ద రోడ్డుపై పడిన సిరిగిడి ఎర్రయ్య, లింగాల సీతారాం, తాటిపూడి వరప్రసాద్‌ తీవ్ర గాయాలతో మృతిచెందారు. బోనెల రమణ కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు, భవానీల సహాయంతో 108లో ఆసుపత్రిలో తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో ఆయన కూడా మృతిచెందాడు. బస్సులో ఉన్న మిగిలిన భక్తులు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఘటనా స్ధలాన్ని పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ పరిశీలించగా అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపంచనామా కోసం ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.

మృతులంతా నిరు పేదలు

- బోనెల రమణ టాక్సీడ్రైవర్‌గా పనిచేస్తూ కొంతకాలం క్రితం కారును ఫైనాన్స్‌ సహకారంతో కొనుక్కొన్నాడు. ఈయన భార్య లక్ష్మి రోజువారీ కూలీగా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లలు ఉండగా పెద్దమ్మాయి సరస్వతికి గత సంవత్సరం పెళ్లి చేశారు. చిన్నమ్మాయి హేమలత హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. కుమారుడు బస్సు క్లీనర్‌గా స్థానికంగా పనిచేస్తున్నాడు.

- సిరిగిడి ఎర్రయ్య బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య లక్ష్మీతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కిశోర్‌ 4వ తరగతి, లోకేష్‌ 3వ తరగతి చదువుతున్నారు.

- లింగాల సీతారాం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య పైడమ్మతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లికిత ఇంటర్‌ చదవుతుండగా కుమారుడు సతీష్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.

- తాటిపూడి శివప్రసాద్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య అప్పలనర్సమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు.

దుర్ఘటన బాధాకరం: మంత్రి లోకేశ్‌

కాకినాడ జిల్లా కత్తిపూడి 16వ నంబరు జాతీయరహదారిపై జరిగిన దుర్ఘటన బాధాకరమని మంత్రి నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన భవానీ భక్తులు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న లోకేశ్‌ కాకినాడ జిల్లా అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసి వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేసి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - Oct 23 , 2026 | 12:15 AM