Share News

Hoping They’ ప్రస్తావిస్తారని.. పరిష్కరిస్తారని!

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:27 PM

Hoping They’ll Raise the Issue.. and Resolve It! వ్యవసాయాధారిత జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు కొలిక్కి రావడం లేదు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. మల్టీ స్పెషాలిటీ ఆసు పత్రి భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, వంతెనలు, రహదారులు, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల పనులకు మోక్షం కల్పించాల్సి ఉంది. పర్యాటక అభివృద్ధి పైనా దృష్టి సారించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులపై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు.

Hoping They’    ప్రస్తావిస్తారని..  పరిష్కరిస్తారని!
పనులు పునః ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల

  • ఎమ్మెల్యేలపై గంపెడాశలు పెట్టుకున్న జిల్లావాసులు

  • మన్యంలో సమస్యలపై గళమెత్తాలని విన్నపం

పార్వతీపురం, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): వ్యవసాయాధారిత జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు కొలిక్కి రావడం లేదు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. మల్టీ స్పెషాలిటీ ఆసు పత్రి భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, వంతెనలు, రహదారులు, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల పనులకు మోక్షం కల్పించాల్సి ఉంది. పర్యాటక అభివృద్ధి పైనా దృష్టి సారించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులపై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. మన్యంలో ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి.. పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వారు.. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి.. జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని ఆశిస్తున్నారు.

సొంత భవనాలు కరువు....

మన్యం జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాల యాలకు సొంత భవనాలు లేవు. ఇప్పటికీ పరాయి పంచనే నిర్వహిం చాల్సిన దుస్థితి. కలెక్టరేట్‌, విద్య, వైద్య ఆరోగ్య , పంచాయతీరాజ్‌ , వ్యవసాయ , గృహ నిర్మాణ తదితర శాఖల సొంత భవనాల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాల్సి ఉంది. ఇకపోతే జిల్లాలో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కీలక శాఖల్లో అధికారులను నియమించాలి. పార్వతీపురం సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సి ఉంది.

వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడు...

గత వైసీపీ ప్రభుత్వం కాలంలో జిల్లాకు వైద్య కళాశాల మంజూరైంది. అయితే అప్పట్లో స్థల పరిశీలన చేశారే తప్ప కళాశాల నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కదలిక వచ్చింది. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఇప్పటివరకు శంకుస్థాపన కూడా చేయలేదు. దీంతో వైద్య కళాశాల నిర్మాణంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావించి.. త్వరితగతని పనులు ప్రారంభించాల్సి ఉంది.

ఆసుపత్రుల భవన నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడు...

పార్వతీపురంతో పాటు సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. ఇంకా ఈ పనులు కొలిక్కి రావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రులను ప్రతిపాదించినప్పటికీ పనులు మాత్రం జోరందుకోలేదు. అయితే ఇప్పటికీ నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ఇరు ఐటీడీఏల పరిధిలో రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. అత్యవసర పరిస్థితుల్లో పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. రిఫెరల్‌ కేసులు కూడా తగ్గుతాయి.

నిధులు ఉన్నా ముందుకు సాగని పనులు

కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నిధులున్నా పనులు ముందుకు సాగడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 80 శాతం పనులు పూర్తయినా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయితే పలు కారణాలతో పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 20 శాతం పనుల పూర్తి అంశాన్ని మరోసారి అసెంబ్లీలో ప్రస్తావించి.. త్వరితగతిన పూర్ణపాడు-లాబేసు వంతెనను ప్రజలు అందుబాటులోకి తేవాల్సి ఉంది.

వీటిపై ప్రస్తావిస్తే మేలు...

పార్వతీపురం మండలం కోరి సర్వే నెంబర్‌-1 రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చేపడుతున్న మైనింగ్‌ పనులపై అసెంబ్లీలో ప్రస్తావించి.. బడిదేవరకొండను రక్షించే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. వెంగళరాయ సాగర్‌, పెద్దగెడ్డ , వట్టిగెడ్డ , జంఝావతి, అడారుగెడ్డ ప్రాజెక్టుల పనులు, గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణం, పార్వతీపురంలో బైపాస్‌ రహదారి, జల్‌ జీవన్‌మిషన్‌ పనులు, పర్యాటక అభివృద్ధి, ఇతర సమస్యలను కూడా అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు..

జిల్లాలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. సాలూరు నియోజకవర్గంలో ఆటో నగర్‌ , పార్క్‌ల అభివృద్ధి, ఇండోర్‌ స్టేడియం, సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ తదితర వాటిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా..

- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి

===========================

పూర్ణపాడు-లాబేసు వంతెన పనులపై..

కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా.. రహదారులు, ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణాలు, ఇతర సమస్యలపై కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తా.

- తోయక జగదీశ్వరి, ప్రభుత్వ విప్‌

===========================

పనులు వేగవంతం చేయాలని..

జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేస్తా మని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒక ఏడాది ముందుగా పూర్తి చేయాలని అసెంబ్లీ ద్వారా కోరుతా. బైపాస్‌ రహదారి , అడారు గెడ్డ రిజర్వాయర్‌ పనులపై ప్రస్తావిస్తా.

- బోనెల విజయచంద్ర, ఎమ్మెల్యే, పార్వతీపురం

===========================

సాగునీటిపై ప్రస్తావిస్తా..

శ్రీకాకుళం జిల్లా నేరడు బ్యారేజ్‌కు పాలకొండ నియోజకవర్గం భామిని నుంచి సాగునీరు వెళ్లిపోతుంది. దీంతో భామిని మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. పాలకొండ రోడ్డు విస్తరణ , తోటపల్లి కుడి కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా.

- నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ

Updated Date - Aug 16 , 2026 | 11:27 PM