Share News

Hopes ‘Withered’ఆశలు‘ఎండి’

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:15 AM

Hopes ‘Withered’ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమవుతున్నా వాన పడడం లేదు. దీంతో రైతులు ఆశగా ఆకాశం వైపు ఎదురుచూడడమే మిగులుతోంది. మరోవైపు సాగుకు అదును దాటుతోంది. వేసవిలో అడపాదడపా వర్షాలు పడడంతో రైతులు దుక్కులు పూర్తిచేసుకున్నారు.

Hopes ‘Withered’ఆశలు‘ఎండి’
గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో ఎండిపోయిన వరినారు

ఆశలు‘ఎండి’

జిల్లాలో తీవ్ర వర్షాభావం

అదును దాటుతున్న వైనం

ముఖం చాటేసిన వరుణుడు

కొన్నిచోట్ల మొలకెత్తని విత్తనాలు..

చాలా చోట్ల ఎండుతున్న వరినారు

ఆందోళనలో రైతులు

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమవుతున్నా వాన పడడం లేదు. దీంతో రైతులు ఆశగా ఆకాశం వైపు ఎదురుచూడడమే మిగులుతోంది. మరోవైపు సాగుకు అదును దాటుతోంది. వేసవిలో అడపాదడపా వర్షాలు పడడంతో రైతులు దుక్కులు పూర్తిచేసుకున్నారు. ఎక్కువగా యద చల్లుకునేందుకు వీలుగా పొలాలను సిద్ధం చేశారు. ఇంకొందరు జూన్‌లో వరి విత్తనాలు వేసుకున్నారు. ఆకుమడులు సిద్ధమయ్యాయి. కానీ వరుణుడి జాడ లేదు. ఆకును కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ట్రాక్టర్లతో డ్రమ్ముల్లో నీటిని తీసుకువెళ్లి తడి అందిస్తున్నారు. ఇంకొందరు కిలోమీటరు దూరం నుంచి బిందెలతో నీటిని మోస్తూ నారును తడుపుతున్నారు. అయినా కూడా చాలా చోట్ల నారు ఎండిపోతోంది.

రాజాం, జూలై 23(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఖరీఫ్‌లో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251 హెక్టార్లు. ఇప్పటివరకూ 7 వేల ఎకరాల్లో యద పద్ధతిలో వరి విత్తనాలు చల్లుకున్నారు. 1352 హెక్టార్లలో వరి ఆకుమడులు సిద్ధం చేసి విత్తనాలు వేశారు. అయితే వర్షాలు కురవక రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొన్నిచోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మరికొన్నిచోట్ల మొలకెత్తిన నారు ఎండిపోతోంది. ఇంకోవైపు వరినాట్లకు అదును దాటుతోంది. మరోవారం తర్వాత వర్షాలుపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. తర్వాత వేద్దామన్నా రైతుల వద్ద వరి విత్తనాలు లేవు. కచ్చితంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎకరానికి 30 కేజీల వరి విత్తనాలు అవసరం.

సాగునీటి వనరుల బేలచూపులు

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్లో కూడా ఆశించిన స్థాయిలో నీరు లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో డెడ్‌ స్టోరేజీ స్థాయికి చేరాయి. కాలువలు, చెరువులు కూడా బేలగా కనిపిస్తున్నాయి. తోటపల్లి, మడ్డువలస, తారకరామతీర్థ సాగర్‌, నారాయణపురం ఆనకట్ట ప్రధాన సాగునీటి ఆధారాలు. కానీ జూలై 3వ వారం దాటినా కొన్ని ప్రాజెక్టుల నుంచి ఇంకా నీటి విడుదల జరగలేదు. ఎల్‌నినో ప్రభావంతో వాటిలో కూడా ఆశించిన స్థాయిలో నీరు లేదు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు చెబుతున్నారు.

ఉబాలు కష్టమే

వరి విత్తనాలు నాటి సుమారు నెల రోజులవుతోంది. చీనుకు జాడ లేక నారు ఎండుతోంది. ఉబాలు వేయడానికి గడువు దాటిపోతోంది. నేను ఆరు ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. ఈ ఏడాది విత్తనాల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో..రావో.

డబ్బాడ ఆదినారాయణ, రైతు, కోడిశ, రేగిడి మండలం

నారు బతుకుతుందా?

గజపతినగరం, జూలై23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాళంరాజపేట, లింగాలవలస, పిడిశీల, సీతారామపురం, శ్రీరంగరాజపురం తదితర గ్రామాల్లో వరిని యద పద్ధతితో పాటు సాధారణ పద్ధతిలోనూ వేశారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షం అనుకూలించక పోతే నాటిన వరి మొక్కలతో పాటు నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులంటున్నారు. ఇప్పటికే ఇంజన్‌ మోటార్లను అద్దెకు తీసుకువచ్చి నారుమడులను రక్షించుకొనే పనిలో ఉన్నారు. కానీ చెరువుల్లోనూ అంతగా నీరులేదని వాపోతున్నారు.

ఎడ్ల బళ్లపై నీరు తెచ్చి..

బొబ్బిలి రూరల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): పిరిడి - అలజంగి పరిసర ప్రాంతాల్లో నారు ఎండిపోయే పరిస్థితికి చేరుతోంది. కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. పొలాల్లో బోర్లు లేని చిన్న సన్నకారు రైతులు గొల్లపల్లి నుంచి ఎడ్లబండ్లపై నీటి డ్రమ్ములు, ట్యాంకర్లను తెచ్చి పొలాలకు నీరిస్తున్నారు. మహిళా రైతు శాంతమ్మ చిన్న డబ్బాలతో ఇటీవల నారుపై నీటిని చల్లుతూ కనిపించారు. భూమి తల్లి ఎప్పటికీ మోసం చేయదని, కష్టం నమ్ముకుంటే కాలమే కరుణిస్తుందన్నారామె.

పైపుల ద్వారా నీటి సరఫరా

బాడంగి, జూలై 23(ఆంధ్రజ్యోతి):

కోటిపల్లి గ్రామంలో ఎండిపోతున్న వరి నారుమడిని రక్షించుకునేందుకు ఎక్కడో దూరంగా ఉన్న చెరువు నుంచి పైపుల ద్వారా నీటిని అందించేందుకు శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల రైతులంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. వర్షాలు పడేంత వరకూ నీటి కోసం శ్రమ తప్పదని, ఆపై దేవుడి దయ అని చెబుతున్నారు.

కళ తప్పిన నారు

సంతకవిటి, జూలై 23(ఆంధ్రజ్యోతి): మద్దూరు శంకరపేట, గరికపాడు, మోదుగులపేటలో యద పద్ధతిలో వేసిన వరి ఎండుతోంది. నారుమళ్లను కాపాడుకోవడానికి అవకాశం ఉన్న చోట రైతులు బావులు, చెరువుల నీటిని ఆయిల్‌ ఇంజెన్ల సహాయంతో తడుపుతున్నారు.

రంగుమారుతున్న నారు

వేపాడ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వేపాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి నారు ఎండిపోతోంది. బోర్లు, బావులు ఉన్న రైతులు ఆయిల్‌ ఇంజన్లతో తడి అందిస్తున్నా సరిపోక నారు రంగు మారుతోంది. రైతులు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వరినారు మళ్లను కాపాడుకోవచ్చునని మండల వ్యవసాయాధికారి స్వాతి అంటున్నారు. 19.19.19ను 5గ్రాములు లేదా 2- 4 ఎంఎల్‌ నానో యూరియా ఎరువును లీటర్‌ నీటికి కలిపి వరినారు మడిపై పిచికారీ చేసేకుంటే నారుమడిని వారం రోజులు పాటు వర్షాభావ పరిస్థితి నుంచి కాపాడుకోవచ్చునని అంటున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:15 AM