Hopes on the central budget కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:51 PM
Hopes on the central budget కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక మార్గం చూపుతుందని భావిస్తున్నారు. కీలకమైన ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన హామీలు కూడా కొలిక్కి రాకపోవడంతో వాటినైనా పూర్తి చేయా లంటున్నారు.
కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు
కీలక ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా?
నిధులు కేటాయిస్తేనే ఫలితం
గిరిజన వర్సిటీ భవనాల నిర్మాణంపై అయోమయం
పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు
విజయనగరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక మార్గం చూపుతుందని భావిస్తున్నారు. కీలకమైన ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన హామీలు కూడా కొలిక్కి రాకపోవడంతో వాటినైనా పూర్తి చేయా లంటున్నారు. గిరిజన వర్సిటీ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. నేటికీ విజయనగరంలో తాత్కాలికంగా భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. 2022లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. రెగ్యులర్ బోధకులను సైతం నియమించారు. కానీ భవనాల నిర్మాణం చేపట్టకపోవడం పెద్ద లోటు. ఆ ప్రభావం ప్రవేశాలపై పడుతోంది. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధి అనేది పూర్తిగా మందగించింది. జూట్, ఫెర్రో, చక్కెర కర్మాగారాలు ఒక్కోటిగా మూతపడుతున్నాయి. రైల్వే ప్రాజెక్టులు కూడా రావడం లేదు. ఎప్పుటి నుంచో ఊరిస్తున్న రాజాం రైల్వేలైన్ ప్రతిపాదన దశ దాటలేదు.
గిరిజన వర్సిటీ భవనాలెప్పుడో?
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అనేది పదేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది. 2023 ఆగస్టు 25న అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మెంటాడ మండలం చినమేడేపల్లి వద్ద పనులు ప్రారంభించినప్పటికీ పూర్తిచేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ మంజూరైంది. కొత్తవలస మండలం రెల్లి వద్ద 527 ఎకరాలను కేటాయించారు. ప్రహరీ నిర్మాణం కూడా చేపట్టారు. జగన్ ప్రభుత్వం స్థలం మార్చేసి భవన నిర్మాణాన్ని విస్మరించింది.
కళ తప్పిన పరిశ్రమలు
జిల్లాలో కొన్నేళ్లుగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతపడుతూ వస్తోంది. ఇంకో వైపు చక్కెర కర్మాగాలదీ అదే పరిస్థితి. జూట్ మిల్లులకు జిల్లా పెట్టింది పేరు. అటువంటిది కేంద్ర ప్రభుత్వపరంగా జూట్‌కు ప్రోత్సాహం లేక తిరోగమన బాట పట్టాయి. జిల్లా మీదుగా గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణం, రెండు జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
రాజాం మీదుగా రైల్వేలైన్ నిర్మిస్తారా?
రాజాం, జనవరి 31(ఆంధ్రజ్యోతి)
రాజాం రైల్వేలైన్ విషయంలో ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి మారింది. ఇది అక్కడి ప్రజల దశాబ్దాల కల. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. లైన్ మంజూరు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత డీపీఆర్ రూపంలో కదలిక వచ్చింది. కానీ ఇంతవరకూ రైల్వేశాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో ఈప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం ఎంపీగా ఎన్నికైన కలిశెట్టి అప్పలనాయుడు 2024 జూలై 29న లోక్‌సభలో తొలి ప్రసంగం చేశారు. రాజాంకు రైల్వేలైన్ అంశాన్ని ప్రస్తావించారు.
ఎరువులపై సబ్సిడీ పెంచాలి
రైతులు గత ఏడాది ఎరువులు అందక ఇబ్బందులు పడ్డారు. ఏకంగా యూరియాపై 30 శాతం సబ్సిడీ తగ్గించారు. దీంతో ప్రైవేట్ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లు అయ్యింది. వ్యవసాయ చట్టాలను సమగ్రంగా అమలు చెయ్యాలి. ఉపాధి హామీ చట్టాన్ని సవ్యంగా అమలుచేసేలా పార్లమెంటులో బిల్లుపెట్టాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులివ్వాలి.
- బి.రాంబాబు ఏపీ రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి
పరిశ్రమలను తెరిపించాలి
జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి. ముఖ్యంగా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలపై దృష్టిపెట్టాలి. వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. చక్కెర కర్మాగారాలను సైతం అందుబాటులోకి తేవాలి. కొత్తవలస మండలంలో రైల్వే వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటు హామీ కార్యరూపం దాల్చడం లేదు.
- రెడ్డి శంకరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
---------------------------