Hopes on the Budget బడ్జెట్‌పై ఆశలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:13 AM
Hopes on the Budget కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మన్యంలో దీర్ఘకాల రైల్వే సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని ఆశిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ మిళితం చేసి ఏటా ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడుతుంది. అయితే జిల్లాలో సమస్యలు మాత్రం యాథాతథంగానే ఉన్నాయి.
స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తే మేలు
కొత్త లైన్లు, వంతెనల ఏర్పాటుకు మోక్షం కలిగేనా?
నిధులు మంజూరు చేస్తేనే ఫలితం
పార్వతీపురం, జనవరి31(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మన్యంలో దీర్ఘకాల రైల్వే సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని ఆశిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ మిళితం చేసి ఏటా ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడుతుంది. అయితే జిల్లాలో సమస్యలు మాత్రం యాథాతథంగానే ఉన్నాయి. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త లైన్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితర వాటికి ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురంలో సుమారు కిలోమీటర్ల లోపు రెండు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కొత్తవలసలో ఉన్న దానిని పార్వతీపురం టౌన్ రైల్వేస్టేషన్‌గా పిలుస్తారు. మరొకటి బెలగాం రైల్వేస్టేషన్. కాగా టౌన్ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలపై పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఆ శాఖాధికారులు దృష్టి సారించాల్సి ఉంది. బెలగాం ప్రాంతంలో ఉన్న రైల్వేగేటు వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఫైఓవర్ నిర్మిస్తామని రైల్వేశాఖ అధికారులు ప్రతిసారీ హామీ ఇస్తున్నా.. పనులు మాత్రం చేపట్టడం లేదు. ఇకపోతే బెలగాం రైల్వేస్టేషన్ పరిధిలో ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాల్సి ఉంది. మరోవైపు విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి పార్వతీపురం , ఒడిశా రాష్ట్రం రాయగడ వరకు నాలుగో లైన్ నిర్మాణానికి సంబంధించి నిధులు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంది.
మూడు కిలోమీటర్ల లోపు మూడు రైల్వే గేట్లు...
కొమరాడ మండలంలో స్వామినాయుడువలస, ఆర్తం, కోటిపాం ప్రాంతాల మధ్య మూడు కిలోమీటర్ల లోపు మూడు రైల్వేగేట్లు ఉన్నాయి. దీంతో ఒడిశా రాష్ట్రం రాయగడతో పాటు కొమరాడ, కూనేరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాహనదారులు, ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. మూడు గేట్లు దాటుకుని గమ్యస్థానం చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. తరచూ గేట్లు పడుతుండడంతో గంటల తరబడి వారు నిరీక్షించాల్సి వస్తోంది. ఇదే సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులుదీరడంతో రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మూడు గేట్లు కలుపుకుని రైల్వేవంతెన నిర్మిస్తామని గతంలో ఆ శాఖాధికారులు ఇచ్చిన హామీ గాలిలోనే కలిసిపోయింది.
ట్రైల్ రన్‌తో సరి..
సాలూరు నుంచి విశాఖకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా .. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గతంలో ట్రాక్ పనులు చేపట్టి.. ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. దీంతో సాలూరు వాసులు ఎంతో సంబరపడ్డారు. అయితే ఇప్పటికీ రైలు నడపకపోవడంతో వారి ఆనందరం ఆవిరైంది. మరోవైపు సాలూరు-బొబ్బిలి మధ్య గతంలో రాకపోకలు సాగించే ట్రైన్ బస్‌కు అతీగతీ లేకుండా పోయింది. కరోనా తర్వాత ఈ సర్వీసును నిలుపుదల చేశారు. తిరిగి పునరుద్ధరించకపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే గ్రామస్థులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సారైనా లైన్ క్లియర్ అయ్యేనా?
సాలూరు రూరల్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఈ సారైనా గుణుపూర్ నుంచి వయా సాలూరు మీదుగా నర్సీపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు మోక్షం కలిగించాలని జిల్లావాసులు కోరుతున్నారు. కాగా కేంద్ర బడ్జెట్‌లో గత 12 ఏళ్లుగా ఈ లైన్ ఏర్పాటుకు, సర్వేకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. బడ్జెట్ అనంతరం రైల్వేశాఖ విడుదల చేసిన పింక్‌బుక్స్‌లో సైతం ఈ లైన్ ఏర్పాటుపై ప్రస్తావన ఉండడం లేదు. 2015లో ఈ లైన్ గురించి సర్వే పనులు చేసి ప్రతిపాదనలు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. ఏ బడ్జెట్‌లోనూ దీని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కేంద్రప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నైన ఈ లైన్ ఏర్పాటు ప్రస్తావించి నిధుల కేటాయిస్తే ఈ ప్రాంతం సత్వర అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాయితే సాలూరు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉంటాయని సాలూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.
పొడిగింపు ఎప్పుడో..
గుణుపూర్ నుంచి వయా సాలూరు మీదుగా నర్సీపట్నానికి కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు జరగనున్నట్టు యూపీఏ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర గిరిజన, పంచాయతీ వ్యవహారాల మంత్రిగా ఉన్న కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ ప్రకటించారు. దీంతో కొత్త లైన్ ఏర్పాటయితే రైల్వే పరంగా సాలూరుకు మహర్దశ పడుతుందని ఇక్కడి వారు ఆనందించారు. అయితే ఈ లైన్ పరిశీలన, సర్వే గురించి ఆనాటి యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం కూడా ఏ బడ్జెట్‌లోను ఈ లైన్ ప్రతిపాదన ఊసెత్తలేదు. ఈ లైన్ పొడి గిస్తే ఈ ప్రాంతంలో ఉన్న గనుల రవాణా ద్వారా ఆదాయం సమకూరే అవకాశముంది. పర్యాటక పరంగా ఆదాయం సమకూరనుంది. సాలూరు రైల్వే స్టేషన్ కూడా పునురుద్ధరణ జరుగుతుంది. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.