ఉపాధిపై ఆశలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:19 AM
జిందాల్ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు.
ఉపాధిపై ఆశలు
ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
జిందాల్ భూముల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)పై ఆరా
2023 నవంబర్‌లో ఇండస్ట్రీయల్ పార్కుగా మార్పు
అప్పట్లో పది రకాల పరిశ్రమలకు ఆహ్వానం
45వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా
భూ నిర్వాసిత రైతుల ఉద్యమానికి తెర పడినట్లే
రేపు వర్చువల్‌గా భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబునాయుడు
శృంగవరపుకోట, జూలై 2(ఆంధ్రజ్యోతి): జిందాల్ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిందాల్ యాజమాన్యం ఈ భూముల్లో నెలకొల్పే ఇండస్ట్రీయల్ పార్కుల వివరాలను బహిరంగ పరచలేదు. ఇండస్ట్రీయల్ కామర్స్ డిమార్ట్‌మెంటు నుంచి అనుమతులు పొందిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో మాత్రమే ప్రతిపాదిత ఎంఎస్‌ఎంఈలు కనిపిస్తున్నాయి. ఈ రిపోర్టు కూడా కొంత మంది అధికారులకు అందించడంతో బయటపడింది.
ఒకప్పుడు అల్యూమినియం శుద్ధి కార్మాగారం (రిఫైనరీ, విద్యుత్ పవర్ ప్లాంటు) నిర్మాణం చేపడతామని చెప్పడంతో 834.66 ఎకరాలు అసైన్డ్ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమి, 180.73 ఎకరాల జిరాయితీ కలిపి మొత్తం 1166.43 ఎకరాలను అప్పట్లో రైతులు అప్పగించారు. ఈ పరిశ్రమను నిర్మించని జిందాల్ యాజమాన్యం మూడు సంవత్సరాల క్రితం ఎంఎస్‌ఎంఈల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీయల్ పార్కుల పేరుతో అనుమతులు తీసుకుంది. జిందాల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నచ్చని భూ నిర్వాసితులు గత ఏడాది జూన్ నుంచి రోడ్డెక్కారు. ఈ పరిణామంతో నిరుద్యోగులు డీలా పడ్డారు. ఏడాది కాలంగా నడిచిన వివాదానికి కూటమి ప్రభుత్వం శనివారం ముగింపుపలికింది. భూనిర్వాసితులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం తరుపున ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి సమక్షంలో భూ నిర్వాసిత రైతుల తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు హామీ ఇచ్చారు. వివాదం సమసిపోవడంతో నిర్వాసిత రైతులు అనందం వ్యక్తం చేస్తున్నట్లే. స్థానిక నిరుద్యోగ యువత ఉద్యోగాలు వస్తాయని సంబరపడుతోంది. నిర్వాసిత రైతు కుటుంబాలకు చెందిన నిరుద్యోగులతో పాటు జిల్లాలో వివిధ విద్యార్హతలు వున్న నిరుద్యోగులు ఈ భూముల్లో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుపై చర్చించుకుంటున్నారు.
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోను ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోంది. ఎక్కడా 300 ఎకరాల విస్తీర్ణం కంటే ఎక్కువ లేదు. ఎస్.కోటలో మాత్రమే ఎక్కువ విస్తీర్ణంలో భూమి కనిపిస్తోంది. రూ.3,970 కోట్ల పెట్టుబడులతో ఈ భూముల్లో నిర్మించనున్న ఇండస్ర్టీయల్ పార్కులతో 45వేల మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని జిందాల్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఆచరణలోకి వస్తే ఈ ప్రాంత ముఖచిత్రం మారుతుందని పరిశీలకులు, విద్యా, పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.