అభివృద్ధిపై ఆశలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:13 AM
భోగాపురానికి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది.
- భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం
-ఆ స్థాయిలో ఏర్పాటుకాని పరిశ్రమలు
- ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతి
విజయనగరం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): భోగాపురానికి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. త్వరలో ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. కానీ ఆశించిన స్థాయిలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. కనీసం బస్సు సదుపాయం కూడా లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
భోగాపురం మండలంలో 22 పంచాయతీలు ఉండగా, 60 వేలకు పైగా జనాభా ఉంది. ఎక్కువమంది వ్యవసాయంతో పాటు కులవృత్తులు, కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కొంతమంది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో వందలాది మంది పూసపాటిరేగ, పైడిభీమవరం (శ్రీకాకుళం), విశాఖపట్నం వెళ్లి వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. మరికొంత మంది హైదరాబాద్, చెన్నై, ముంబాయి వంటి దూరప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్టు వచ్చినా జీవనోపాధికి ఉపయోగపడే పరిశ్రమలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాలమైన చెరువులు ఉన్నా కొందరు వాటిని ఆక్రమించుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేయడం లేదని అంటున్నారు. ఇక్కడ సరైన ఆసుపతుల్రు, పాఠశాలలు, కళాశాలలు లేవు. దీంతో అనేక మంది స్థానికులు విద్య, వైద్యం కోసం విజయనగరం, విశాఖనగరాలకు వెళ్తున్నారు. కనీసం ఆర్టీసీ సౌకర్యం కూడా సరిగా లేదు.
ఉపాధి అవకాశాలపై ఆశలు
ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు. విమానాశ్రయాన్ని ప్రారంభించిన తరువాతైనా వీలున్నంత మేరకు తమకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.