Share News

ఆశలు ఆవిరై.. కలలు కల్లలై!

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:59 PM

Hopes Fade Away, Dreams Shattered! కొన్నాళ్ల కిందట తండ్రి చనిపోతే.. ఇంటికి పెద్దదిక్కుగా మారాడు. ఐదేళ్లుగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ.. తల్లి, చెల్లికిఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఉన్నంతలో చెల్లిని చదివించాడు. కొద్దిరోజుల్లో సోదరి పెళ్లి చేసి ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే విధి చిన్నచూపు చూసింది. జీవనాధారమైన వాహనమే మృత్యువు రూపంలో కబళించింది. ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఆ యువకుడు మృతి చెందాడు.

  ఆశలు ఆవిరై.. కలలు కల్లలై!
నవీన్‌ ( ఫైల్‌)

  • చెల్లి కి పెళ్లి చేయాలనుకుని.. ఇంతలోనే అనంతలోకాలకు

  • శోకసంద్రంలో కుటుంబసభ్యులు

పాలకొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొన్నాళ్ల కిందట తండ్రి చనిపోతే.. ఇంటికి పెద్దదిక్కుగా మారాడు. ఐదేళ్లుగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ.. తల్లి, చెల్లికిఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఉన్నంతలో చెల్లిని చదివించాడు. కొద్దిరోజుల్లో సోదరి పెళ్లి చేసి ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే విధి చిన్నచూపు చూసింది. జీవనాధారమైన వాహనమే మృత్యువు రూపంలో కబళించింది. ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఆ యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం ఆశలన్నీ ఆవిరయ్యాయి. కలలన్నీ చెదిరిపోయాయి. యువకుడి అకాల మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మాకు దిక్కెవరెంటూ భోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వీరఘట్టం మండలం కంబరకు చెందిన బూరి నవీన్‌ (28) తల్లి ఈశ్వరమ్మ, చెల్లి మౌనికతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోవడంతో సొంతంగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజూలానే సోమవారం పనిలోకి వెళ్లాడు. స్వగ్రామం నుంచి పాలకొండ మండలం నవగాం గ్రామ పంట పొలాల్లోని కల్లాలకు ట్రాక్టర్‌తో ధాన్యం తరలించేందుకు బయల్దేరాడు. కాగా వీరన్నదొర చెరువులోకి ట్రాక్టర్‌తో దిగి తిరిగి గట్టు ఎక్కుతున్న క్రమంలో వాహనం ఇంజన్‌ తలకిందులైంది. ఈ క్రమంలో ఇంజన్‌లో చిక్కుకున్న నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి , చెల్లి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న నవీన్‌ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ట్రాక్టర్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో చెల్లి పెళ్లి చేయాలనుకున్నాడని.. అయితే ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు రోదించారు. పాలకొండ ఎస్‌ఐ వెంకన్న ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Nov 23 , 2026 | 11:59 PM