Share News

హోంమంత్రి దృష్టికి ప్రైవేటు సంస్థ మోసం

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:31 AM

ఉత్తరాంధ్రలో సంచలనం సృష్టిస్తున్న ఓప్రైవేటు సంస్థ చీటింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.

హోంమంత్రి దృష్టికి ప్రైవేటు సంస్థ మోసం
మోసపోయిన బాధితులు

- 30న విజయనగరంలో కలవనున్న బాధితులు

- సీఎం, డిప్యూటీ సీఎంకూ ఫిర్యాదులు

- మంత్రి లోకేష్‌కూ పంపేందుకు నిర్ణయం

విజయనగరం క్రైం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో సంచలనం సృష్టిస్తున్న ఓప్రైవేటు సంస్థ చీటింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ సంస్థ బాగోతాన్ని ఈ నెల 30న జిల్లాకు రానున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకువెళ్లాలని బాదితులు నిర్ణయించారు.హోంమంత్రి అనిత సోమ,మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు.సోమవారం పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి అనిత,మర్నాడు డీఅర్సే సమావేశానికి హాజరవుతారు.ఈమేరకు అందిన సమాచారం నేపథ్యంలో సోమవారం ఆమెను కలసి గోడు వినిపించుకోవాలని నిశ్చయించారు.అదే సందర్భంలో కలెక్టర్‌,ఎస్పీ కార్యాలయాల్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాధు చేసేందుకు సిద్దమవుతున్నారు.ఆయా కార్యాలయాల్లో ఇచ్చే ఫిర్యాదుల పత్రాలను హోం మంత్రి అనితకు కూడా స్వయంగా అందజేసి తాము ఎలా మోసానికి గురైందీ విన్నవించుకోవాలని బాధితులు ఏకాభిప్రాయానికి వచ్చారు.విజయనగరంతో పాటు శ్రీకాకుళం,విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా బాధితులు రానున్నట్టు తెలియవచ్చింది. అలాగే,హోంమంత్రి కి అందజేసే ఫిర్యాదు కాఫీలను ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌,మంత్రి నారా లోకేష్‌ వారి సామాజిక మాధ్యమాలు ఖాతాలు ద్వారా పంపాలని కూడా నిర్ణయించారు. మరోవైపు,సదరు ప్రైవేటు సంస్థ తమకు చేసిన అన్యాయంపై న్యాయపోరాటానికి బాధితులు సన్నద్దమవుతున్నారు.ఆ ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు.మొత్తమ్మీద,సదరు ప్రైవేటు సంస్థ తమకు చేసిన అన్యాయంపై ముప్పేటదాడికి సిద్దమైన బాధితలు...న్యాయం జరిగేవరకు వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:31 AM