Home Guard.. Rs. 20 Crores! హోంగార్డు.. రూ.20 కోట్లు!
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:04 AM
Home Guard.. Rs. 20 Crores! పోలీసుశాఖలో హోంగార్డు. 2010లో విధుల్లో చేరాడు. అవినీతి నిరోధకశాఖలో డ్యూటీ. ఇంకేం.. ఇంటిదొంగగా మారాడు.
హోంగార్డు.. రూ.20 కోట్లు!
ఒకేచోట 15 సంవత్సరాలు విధులు
ఏసీబీలో చేస్తూ ఇంటిదొంగగా మారి..
అనుమానం వచ్చి వెనక్కి పంపిన వైనం
అక్రమ సంపాదనపై అధికారుల నిఘా
విజయనగరం, గుర్లలో ఆకస్మిక తనిఖీలు
కీలకమైన డాక్యుమెంట్ల స్వాధీనం
అరెస్టుచేసి రిమాండ్‌కు తరలింపు
పోలీసుశాఖలో హోంగార్డు. 2010లో విధుల్లో చేరాడు. అవినీతి నిరోధకశాఖలో డ్యూటీ. ఇంకేం.. ఇంటిదొంగగా మారాడు. రూ.కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు. దాడుల సమాచారం ముందే చెప్పడం.. బహుమానంగా డబ్బులు, స్థలాలు తీసుకోవడం! 15 ఏళ్ల పాటు ఇదే చేశాడు. ఇటీవలే ఆ శాఖ అధికారులకు అతనిపై అనుమానం వచ్చింది. జిల్లా కార్యాలయానికి పంపించేశారు. తర్వాత నిఘా పెట్టారు. కూపీ లాగితే అక్రమాల డొంక కదిలింది. గురువారం జిల్లాలో రెండు చోట్ల తనిఖీలు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
విజయనగరం క్రైం/ గుర్ల, జనవరి29(ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీస్‌శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నెట్టి శ్రీనివాసరావు 2010లో హోంగార్డుగా విధుల్లో చే రారు. అప్పటినుంచి 2025 వరకు విజయనగరం ఏసీబీ కార్యాలయంలో పనిచేశారు. ఏసీబీ అధికారులకు అందే కీలక సమాచారం.. లంచం కేసులు, అక్రమాస్తుల వివరాలను తెలుసుకుని సంబంధిత అవినీతి అధికారులకు చేరవేసేవాడని, దీంతో వారినుంచి భారీగా నగదు లేదా స్థలం రూపంలో మామూళ్లు తీసుకునే వాడని అభియోగం. ఇటీవల సబ్‌రిజిస్ట్రార్ కార్యలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారనే కీలక సమాచారాన్ని ముందుస్తుగానే సంబంధిత అవినీతి అధికారులు, సిబ్బందికి శ్రీనివాసరావు చేరవేశాడు. ఇలాగే జిల్లాలో అనేక మంది అవినీతి అధికారులకు ముందస్తుగా సమాచారం అందించి కోట్ల రూపాయల్లో ఆస్తులను కూడగట్టినట్టు ఏసీబీ అధికారులకు తెలిసింది. శ్రీనివాసరావు కదలికలపై అనుమానం రావడంతో నిఘా పెట్టారు. ఏడాది క్రితం జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించారు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి గురువారం ఏకకాలంలో విశాఖలోని పెందుర్తి, గోపాలపట్నం, శ్రీనివాస్ నివాసం ఉంటున్న విజయనగరం గోకపేటతో పాటు సొంతగ్రామమైన గుర్లమండలం నడుపూరులో ఏసీబీ డీఎస్‌పీ రమ్య ఆధ్వర్యంలో సీఐలు మహేష్, సుప్రియ, రమణ, వెంకటరావులు, సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా అస్తులను గుర్తించారు.
- తనిఖీల్లో సిరాస్తులకు సంబధిదించి పలు కీలకమైన డాక్యుమెంట్లు, రెండు ఖరీదైన ఇంటిస్థలాలు, ఒక భవనం, నాలుగు ఇళ్లస్థలాలు, 23.50 సెంట్ల వ్యవసాయ భూమి, 166 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.60 వేల నగదు, రూ.7లక్షల 7 వేల బ్యాంకు బ్యాలెన్స్, ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు బహిరంగ మార్కెట్‌లో రూ.20కోట్ల పైమాటేనని సమాచారం.
అనుమానం రావడంతోనే
ఏసీబి డీఎస్పీ రమ్య మాట్లాడుతూ హోంగోర్డు శ్రీనివాసరావు కదలికలపై అనుమానం రావడంతో ఏసీబీ శాఖ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి ఏటాచ్ చేశామని, పూర్తి స్థాయిలో వివరాలు సేక రించి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. అక్రమాస్తుల వివరాలను కూడా సేకరించామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగినట్టు సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబరు 1064, 94404 40057లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నెట్టి శ్రీనివాసరావుపై అక్రమాస్తులు కలిగి ఉన్నారని కేసు నమోదు చేస్తూ ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ రమ్య తెలిపారు.