Share News

Stick Bridge.. ఒకరికొకరు పట్టుకుని .. కర్రల వంతెన దాటుకుని..

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:01 AM

Holding on to Each Other.. Crossing the Makeshift Stick Bridge.. కురుపాం మండలంలో భోరి, బండిగూడ గ్రామాల విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. బడికి వెళ్లాలంటే ఎటువంటి రక్షణ లేని కర్రల వంతెనను దాటాల్సి వస్తోంది. బిక్కుబిక్కుమంటూ రోజుకు రెండు సార్లు ఆ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

  Stick Bridge.. ఒకరికొకరు పట్టుకుని .. కర్రల వంతెన దాటుకుని..
కర్రల వంతెన దాటుకుని పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

  • భోరి, బండిగూడ వాసులకు తప్పని అవస్థలు

  • వైసీపీ హయాంలో నిధులు మంజూరైనా చేపట్టని పనులు

  • కూటమి ప్రభుత్వం పైనే ఆశలు

కురుపాం రూరల్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కురుపాం మండలంలో భోరి, బండిగూడ గ్రామాల విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. బడికి వెళ్లాలంటే ఎటువంటి రక్షణ లేని కర్రల వంతెనను దాటాల్సి వస్తోంది. బిక్కుబిక్కుమంటూ రోజుకు రెండు సార్లు ఆ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కొన్నా ళ్లుగా ఈ పరిస్థితి ఉన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు గ్రామాల్లో 18 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. భోరి, బండిగూడలో పాఠశాల లేదు. దీంతో వారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొటివాడ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఈ చిన్నారులంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భోరి - గొటివాడ గ్రామాల మధ్య ఉన్న భోరి గెడ్డను దాటి స్కూలుకు చేరుకునేవారు. ప్రమాదాన్ని గుర్తించిన ఆ రెండు గ్రామాలకు చెందిన 60 గిరిజన కుటుంబాలు రెండేళ్ల కిందట ఇంటికి రూ. 1000 చొప్పున చందాలేసుకున్నాయి. ఈ మేరకు గ్రామస్థులు శ్రమదానంతో గెడ్డపై కర్రల వంతెనను నిర్మించుకున్నారు. ఏటా దానికి మరమ్మతులు కూడా చేపడుతున్నారు. దీంతో కొన్నాళ్లుగా విద్యార్థులు ఒకరికొకరు పట్టుకుని.. అడుగులో అడుగులేస్తూ.. ఈ కర్రల వంతెనను దాటుకుని బడికి చేరుకుంటున్నారు. వర్షాలు అధికంగా కురిస్తే ఇక అంతే పరిస్థితి. ప్రస్తుతం భోరి గెడ్డలో ఎనిమిది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. వర్షాలు ఎక్కువగా కురిస్తే కర్ర వంతెన మీదుగా నీరు పారుతుంది. ఈ సమయంలో భోరి, బండిగూడ గ్రామా లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్‌ అవుతాయి. దీంతో విద్యార్థులు, గ్రామస్థులు పూర్తిగా ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తోంది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని గత వైసీపీ ప్రభుత్వం చెప్పినా.. పనులు మాత్రం చేపట్టలేదని గొటివాడ ఎంపీటీసీ సభ్యురాలు తిమ్మక సునీత తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి చొరవ చూపాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:01 AM