Hindi ఐదో తరగతి నుంచే హిందీ
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:58 PM
Hindi Introduced from Class 5 Onwards కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు హిందీ సబ్జెక్టు బోధించాలని నిర్ణయించింది.
పాఠ్యాంశాల బోధనకు చర్యలు
పాలకొండ, జూన్6(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు హిందీ సబ్జెక్టు బోధించాలని నిర్ణయించింది. ఐదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌తో పాటు హిందీని కూడా బోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో ఆరో తరగతి నుంచి మాత్రమే హిందీ సబ్జెక్టు ఉండేది. అయితే అందుకు భిన్నంగా ప్రాథమిక స్థాయిలోనే చిన్నారులకు హిందీ భాషను పరిచయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతి విద్యార్థులకు అందించనున్న తెలుగు, ఇంగ్లిష్ వర్క్‌బుక్‌లోనే చివరి పది పేజీల్లో హిందీ సబ్జెక్టు పరిచయం చేశారు. ఈ మేరకు వర్క్‌బుక్‌ను ముద్రించారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం .. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 421 ఉండగా.. వాటిల్లో ఐదో తరగతి విద్యార్థులు సుమారు పది వేల నుంచి 11 వేల మంది వరకూ విద్యార్థులు చదువుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే నూతనంగా ముద్రించిన పుస్తకాలను మండలాలకు చేర్చారు. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత ఆయా విద్యార్థులకు హిందీ సబ్జెక్టు పుస్తకాలను అందించనున్నారు. దీనిపై డీఈవో బ్రహ్మాజీరావును వివరణ కోరగా.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు కింద హిందీ బోధిస్తాం. వర్క్ బుక్‌లో చివరి పది పేజీల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. సంసిద్ధత ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు హిందీని పరిచయం చేస్తాం. ’ అని తెలిపారు.