Share News

‘High’-way of Accidents ప్రమాదాల ‘హై’వే

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:38 AM

‘High’-way of Accidents ఈ నెల 24న భోగాపురం మండలం సుంకరంపేట సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ల్యాంకర్‌ను కారు ఢీకొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాలు వీధిన పడ్డాయి.

‘High’-way of Accidents ప్రమాదాల ‘హై’వే
జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయిన జీపు(ఫైల్‌)

ప్రమాదాల ‘హై’వే

16వ జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు

యూటర్న్‌ వద్ద కనిపించని సూచిక బోర్డులు

బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించడంలో జాప్యం

కానరాని నియంత్రణ చర్యలు

ఇతర కీలక రహదారులపైనా ప్రమాదాలు

- ఈ నెల 24న భోగాపురం మండలం సుంకరంపేట సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ల్యాంకర్‌ను కారు ఢీకొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాలు వీధిన పడ్డాయి.

- మే 29న భోగాపురం సమీపంలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బైక్‌పై వస్తూ నెమ్మదిగా వెళుతున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

- ఏప్రిల్‌ 28న పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న కారు అర్ధరాత్రి సమయంలో టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దర్ని ఢీకొట్టింది. అనంతం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

జిల్లాలో జాతీయ రహదారి-16తో పాటు అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 30 కిలోమీటర్లకుపైగా ఎన్‌హెచ్‌ 16 ఉంది. మరోవైపు ఎన్‌హెచ్‌ 23 సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఆపై విశాఖ-విజయ నగరం-పాలకొండ రహదారి సైతం ఉంది. ఈ మూడు రహదారులపైనా ఎప్పటికప్పుడే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యకృత్యంగా మారిపోయాయి. జిల్లాలో గత నాలుగేళ్లలో వందలాది రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సుమారు 800 మంది వరకూ మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సింహభాగం ప్రమాదాలు జాతీయ రహదారులపై జరిగినవే.

విజయనగరం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో విస్తరించి ఉన్న 16వ జాతీయ రహదారిని కొన్నేళ్ల కిందట 6 లైన్లుగా విభజించారు. 30 చోట్ల వంతెనలు నిర్మించారు. పరిమిత సంఖ్యలో యూటర్న్‌లు ఏర్పాటుచేశారు. ఇలా యూటర్నుల్లో కొన్నిచోట్ల సూచిక బోర్డులు లేవు. ఇంకొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు కప్పేస్తున్నాయి. ప్రయాణికులు గమనించక అయోమయానికి గురవుతున్నారు. చాలా దూరం వెళ్లిన తరువాత తిరిగి వెనక్కు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు చేశారు కానీ వాహనాలు నిలిపేందుకు అనువుగా స్థలాలను కేటాయించలేదు. దీంతో లారీలతో పాటు ఇతర వాహనాలను ఎక్కడిపడితే అక్కడ ఆపేస్తున్నారు. దీనివల్ల కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ ప్రమాదాలు అర్ధరాత్రి తరువాత, వేకువజామున ఎక్కువగా జరుగుతున్నాయి.

బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తిస్తున్నా..

జాతీయర హదారి 16లో పూసపాటిరేగ మండలం చోడవరం, ఇదే రహదారిలో కామవరం నుంచి జంక్షన్‌ వరకు 3 చోట్ల బ్లాక్‌ స్పాట్స్‌ (ప్రమాదకర స్థలాలు) ఉన్నట్లు అధికారులు గురించారు. భోగపురం మండలం పోలిపల్లి, రాజాపులోవ, సవరవిల్లి, భోగాపురం, లింగాలవలస, మహారాజుపేట జంక్షన్‌లలో బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించారు. ఎక్కువ ప్రమాదాలు జరుగున్నట్లు నిర్ధారించారు. అదే విదంగా జాతీయ రహదారి-23లో 9 చోట్ల బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నాయి

డ్రైవర్ల నిర్లక్ష్యంతోనూ..

జాతీయ రహదారి కావడంతో ఏదీ అడ్డు ఉండదన్న భావనతో వాహనదారులు వేగంగా వెళుతున్నారు. అదే సమయంలో నిద్రపోయేందుకు లారీ డ్రైవర్లు వాహనాన్ని పక్కన ఆపుతున్నారు. రాత్రి వేళల్లో అయితే రోడ్డుపై సిగ్నల్‌ ఇండికేటర్‌ వేయకుండా నిలిపివేస్తున్నారు. కొన్నిసార్లు వాహనాలు వస్తున్నదీ లేనిదీ చూసుకోకుండా రివర్స్‌ చేస్తున్నారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు శాపంగా మారుతోంది.

సూచిక బోర్డులేవీ?

ప్రమాదాలు నియంత్రించడానికి, ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించేందుకే జాతీయ రహదారిని విస్తరించారు కానీ రోడ్డు విస్తరణ తరువాత ప్రమాదాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు సైతం గుర్తించారు. సర్వీసు రోడ్లు ప్రారంభం, ముగింపుల వద్ద భారీ బోర్డులు కనిపించేలా ఏర్పాటుచేయడం లేదు.

ప్రత్యేకంగా దృష్టి పెట్టాం

జిల్లాలో జాతీయ రహదారులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాదాలకు కారణమైన బ్లాక్‌స్పాట్స్‌ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. జాతీయ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటాం. అతివేగం, నిర్లక్ష్యం, నిద్రలేమి, డ్రంక్‌ అండ్‌ డైవ్‌ వంటివి ప్రమాదాలకు ముఖ్యకారణంగా గుర్తించాం. ప్రమాదాలు నిలువరించటానికి ఎప్పటికప్పుడు స్పెషల్‌ డైవ్‌లు చేపడుతున్నాం.

- దామోదర్‌, ఎస్పీ, విజయనగరం

నాలుగు సంవత్సరాల్లో జరిగిన ప్రమాదాలు

---------------------------------

సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

----------------------------------

2023 668 213 826

2024 633 230 815

2025 618 232 735

2026 434 169 538

---------------------------------

Updated Date - Nov 27 , 2026 | 12:38 AM