Share News

Farming Methods ఆధునిక సాగు విధానాలతో అధిక ఆదాయం

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:10 AM

Higher Income Through Modern Farming Methods రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం సూరంపేటలో పొలం గట్లుపై మొక్కలు నాటారు. పండ్ల, వాణిజ్య మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు.

 Farming Methods ఆధునిక సాగు విధానాలతో అధిక ఆదాయం
గట్టు మీద చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్‌

సీతానగరం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం సూరంపేటలో పొలం గట్లుపై మొక్కలు నాటారు. పండ్ల, వాణిజ్య మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. అనంతరం పంట పొలాల్లో డ్రోన్‌ ద్వారా పురుగు మందులు, ఎరువుల పిచికారీని పరిశీలించారు. డ్రోన్ల వినియోగంతో సమయం, కూలీల ఖర్చు తగ్గడంతో పాటు పంటకు మందులు సమానంగా అందుతాయని చెప్పారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేసే అధిక రాబడినిచ్చే వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయశాఖ రాయితీలు, శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జోగింపేటలో చెరువుల పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి చెరువు గట్లుపై మొక్కలు నాటారు. చెరువులు, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి కీలకమని తెలిపారు. కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఏవో భవానీశంకర్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యం తగదు

పార్వతీపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరువుల సరిహద్దుల గుర్తింపు, ఆక్రమణల తొలగింపు, ట్రెంచ్‌ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గురువారం కలెక్టర్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. చెరువులను ఆక్రమించిన వారిపై ఆర్‌ఆర్‌ఆర్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి.. భారీ జరిమానాలు విధిస్తామన్నారు. చెరువు గట్ల వెంట ట్రెంచ్‌ పనులు పూర్తి చేసి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. సర్వే, కూలీల సంఖ్య మస్టర్‌రోల్స్‌, రోజువారీ పురోగతిని గూగుల్‌ షీట్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో సోలార్‌ స్ర్టీట్‌లైట్లు, ఆర్‌వో ప్లాంట్లు, బస్సు షెల్టర్లు, సీసీ డ్రైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఐటీడీఏ పీవోలు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.మాధురి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:10 AM