Share News

బీసీల్లో జోష్‌!

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:08 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది.

  బీసీల్లో జోష్‌!

-స్థానిక సంస్థల్లో వారికి సగటున 28.18 శాతం రిజర్వేషన్లు

- రాజీవ్‌ రంజన్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా జీవో

- కూటమి పార్టీల తరఫున 34 శాతానికి పైగా వారికే టికెట్లు

- ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం

విజయనగరం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్‌ వెల్లడించే అవకాశం ఉంది. ముందుగా పట్టణ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ జనాభాకు అనుగుణంగా రాజీవ్‌ రంజన్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలో సగటున 28.18 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో 17ను జారీ చేసింది. చట్టపరమైన పరిమితుల వల్ల ఎక్కడైనా కోటా తగ్గితే.. కూటమి పక్షాలు తమ అభ్యర్థులకు ఏకంగా 34 శాతానికి తగ్గకుండా టికెట్లు ఇచ్చి రాజకీయంగా అండగా నిలుస్తామని ప్రకటించింది. దీంతో స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున పోటీచేసే వారికి 34 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కనున్నాయి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు 14 శాతం, బీసీలు 34శాతానికి పైగా ఉండగా, మిగిలినది ఇతర సామాజిక వర్గాల వారే. దీంతో జిల్లాలో కూటమి పార్టీల పరంగా బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ అమలు చేయడంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు.

జిల్లాలో బీసీలే అధికం..

జిల్లాలో తూర్పుకాపు, కొప్పల వెలమ సామాజిక వర్గాలు ప్రధానంగా ఉన్నాయి. వీరితో పాటు యాదవ, నాగావంశం, పట్టుశాలి, పద్మశాలి వంటి వర్గాలు ఉన్నాయి. దాదాపు అందరూ బీసీలే. మరోవైపు ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఓసీలుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా పార్టీపరంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడంతో ప్రధాన సామాజిక వర్గాలకు ప్రయోజనం కలగనుంది. వారు 50 శాతానికిపైగా స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్‌..ఇలా అన్ని పదవులు బీసీల రూపంలో ప్రధాన సామాజిక వర్గాలకు దక్కనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఉన్నచోట తప్ప మిగతా అన్నిచోట్ల బీసీలే ఎక్కువగా ప్రాతినిధ్యం వహించనున్నారు.

సింహభాగం వారికే..

జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ ఉన్నాయి. నాలుగింట మూడో వంతు బీసీలే మేయర్‌గా, మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరోవైపు 28 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 777 పంచాయతీలకు గాను సర్పంచ్‌లు, 552 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 28 ఎంపీపీ పదవులు ఉన్నాయి. వీటిలో సింహభాగం పదవులు బీసీలకే దక్కనున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌, విజయనగరం మేయర్‌ వంటివి బీసీలకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల ప్రాప్తికి పదవులు వరించనుండడంతో కూటమి పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే బీసీలకు సముచిత స్థానం..

జిల్లాకు చెందిన చాలామంది బీసీ నేతలకు టీడీపీ అధిష్టానం ఇప్పటికే సముచిత స్థానం కల్పించింది. కర్రోతు బంగారురాజును రాష్ట్ర మార్కెఫెడ్‌ చైర్మన్‌గా, కిమిడి నాగార్జునను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, డీసీసీబీ చైర్మన్‌గా, గొంప కృష్ణను డీసీఎంఎస్‌ చైర్మన్‌గా, గజపతినగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవిని పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా, తెంటు లక్ష్మునాయుడును బుడా చైర్మన్‌గా నియమించింది. అదే విధంగా ఏఎంసీ చైర్మన్లతో పాటు, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

Updated Date - Oct 11 , 2026 | 12:08 AM