Share News

high problems కన్నీటి కష్టాలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:53 PM

high problems జిల్లాలో ప్రైవేటు సంస్థ మోసాలకు నిండా మునిగిన బాధితుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. ఎవరిని కదిపినా ఉప్పెనలా కన్నీరు ఉబికివస్తోంది. నమ్మి, మోసపోయి చివరకు మతిస్థిమితం కోల్పోయి జీవచ్ఛవంలా బతుకువెళ్లదీస్తున్న వారొకరైతే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న భర్తను కాపాడుకునేందుకు వైద్య ఖర్చుల కోసం సర్దుబాటు చేసుకున్న డబ్బును సైతం పోగొట్టుకున్న ధీనగాథ ఇంకొకరిది.

high problems కన్నీటి కష్టాలు

కన్నీటి కష్టాలు

ప్రైవేటు సంస్థ మోసాలతో అయోమయంలో బాధితులు

భర్త క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌కు దాచుకున్న డబ్బుపోయిందని విలవిల

మతిస్థిమితం కోల్పోయి జీవచ్ఛవంలా మారానని మరొకరి ఆవేదన

బాధితుల ఆశలన్నీ పోలీసుల పైనే

విజయనగరం క్రైం ,మార్చి 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రైవేటు సంస్థ మోసాలకు నిండా మునిగిన బాధితుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. ఎవరిని కదిపినా ఉప్పెనలా కన్నీరు ఉబికివస్తోంది. నమ్మి, మోసపోయి చివరకు మతిస్థిమితం కోల్పోయి జీవచ్ఛవంలా బతుకువెళ్లదీస్తున్న వారొకరైతే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న భర్తను కాపాడుకునేందుకు వైద్య ఖర్చుల కోసం సర్దుబాటు చేసుకున్న డబ్బును సైతం పోగొట్టుకున్న ధీనగాథ ఇంకొకరిది. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయా కుటుంబాలు కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నాయి. ఒకటా.. రెండా! తరచి చూస్తే కళ్లు చెమర్చే ఇలాంటి వేదన భరిత ఉదంతాలు ఎన్నో! బాధితులు వాట్సాప్‌ గ్రూపుల్లో పంచుకుంటున్న ఇలాంటి హృయ విదారక ఉదంతాలు మనసును మెలిపెట్టేవిగా ఉంటున్నాయి. న్యాయం కోసం వారంతా ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. వారి నమ్మకమంతా పోలీసులపైనే ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో వచ్చిన కదలికతో వారిలో కొత్త ఆశలు చివురిస్తున్నాయి. పొరుగు జిల్లాల బాధితులు సైతం ఫోన్లు చేసి ‘ఆంధ్రజ్యోతి’ వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు.

దిక్కుతోచడం లేదు

క్యాన్సర్‌తో బాధపడుతున్న భర్త రామారావు చికిత్స కోసం పది లక్షల రూపాయలు సర్దుబాటు చేసుకొన్నాను. బంగారం తాకట్టు పెట్టి ట్రాక్టర్‌ అమ్మేశాను. ఆ సమయంలో సంస్థ సిబ్బంది వచ్చి రూ.పది లక్షలు జమచేస్తే రెండుమూడు రెట్లు అదనంగా వస్తుందన్నారు. నెలవారీ వచ్చే పేమెంట్‌తో వైద్యం చేయించుకోవచ్చునని, అసలు అలాగే ఉంటుందని చెప్పారు. గతేడాది మార్చి 15న రూ.పదిలక్షలు వారి చేతిలో పెట్టాను. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాను. మా పరిస్థితి రోడ్డున పడింది. భర్త ఆరోగ్యం రోజురోజూకూ క్షీణిస్తోంది. దిక్కుతోచడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు. న్యాయం జరగకపోతే కుటుంబం మొత్తానికి చావేగతి.

గుంత రమణమ్మ, బాధితురాలు

ఆసుపత్రి పాలయ్యాను

సంస్థ మాటలు నమ్మి రూ.20 లక్షలు పెట్టాను. అందులో రూ.పదిలక్షలు నావి. మిగిలినవి స్నేహితులు, బంధువులతో చెప్పి పెట్టించాను. మొత్తం రూ.20 లక్షల్లో వచ్చింది కేవలం రూ.లక్ష. రావాల్సిన రూ.19 లక్షల గురించి అడిగితే సంస్థ ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. నెలకు రూ.లక్షా 5 వేల వరకు ఈఎంఐ కట్టాలి. బెంగతో మంచం పట్టాను. ఆరోగ్యం క్షీణించిపోయింది. మతిస్థిమితం కోల్పోయాను. వైద్యుల చుట్టూ తిరుగుతున్నాను. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంధువులు,స్నేహితులు డబ్బుల గురించి ఒత్తిడి చేస్తున్నారు. అప్పుచేసి రూ.మూడు లక్షలు స్నేహితులకు సర్దుబాటు చేశాను.

రఫీ, బాధితుడు

---------------------

Updated Date - Mar 26 , 2026 | 11:53 PM