Share News

రోగులు ఎక్కువ.. వసతులు తక్కువ

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:06 AM

బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి నిత్యం రోగులతో కిటికిటలాడుతుంటుంది.

 రోగులు ఎక్కువ.. వసతులు తక్కువ
ఆస్పత్రి వరండాలో వేచిఉన్న రోగులు

- సరిపడా వార్డులు కరువు

- ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడే చికిత్స

- హామీకే పరిమితమైన వంద పడకలు

- బొబ్బిలి సీహెచ్‌సీలో రోగులకు తప్పని అవస్థలు

బొబ్బిలి, జూలై 9(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి నిత్యం రోగులతో కిటికిటలాడుతుంటుంది. బొబ్బిలి పట్టణం, మండలం నుంచే కాకుండా పొరుగున గల పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, సీతానగరం, మక్కువ తదితర పది మండలాల నుంచి రోగులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతిరోజూ ఓపీ 350 నుంచి 400వరకు ఉంటుంది. 50 పడకలు గల ఈ ఆస్పత్రిలో సరిపడా వార్డులు లేవు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడే రోగులను ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఓపీకి వచ్చేవారికి కూర్చోడానికి ఎటువంటి వసతులు లేవు. వారంతా చీటీలు రాయించుకొని వైద్యులు తనిఖీ చేసి మందులను తీసుకెళ్లే వరకు అవస్థలు పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైద్యవిజ్ఞాన పరిషత్‌ నుంచి రూ.3.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆస్పత్రి స్థాయిని 30 నుంచి 50 పడకలకు పెంచారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆస్పత్రి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి కోసం ఏవేవో చేస్తున్నట్లు ఆర్భాటం చేశారే తప్పా ఎలాంటి పనులు చేయలేదు. ఎంతో ప్రాముఖ్యత గల ఈ ఆసుపత్రిని ఎప్పుడో వందపడకలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. కానీ, ఆ హామీ ప్రకటనలకే పరిమితమైంది.

ఎందుకీ నిర్లక్ష్యం..

ఆస్పత్రిలో గైనిక్‌, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, జనరల్‌ ఫిజీషియన్‌, ఆప్త్మాలజీ తదితర 11 మంది వైద్యనిపుణులు సేవలందిస్తున్నారు. సరిపడా వసతులు లేకపోవడంతో ఆసుపత్రి అంతా రోగులు, వైద్యులు, సిబ్బందితో కిక్కిరిసి ఉన్నట్లుగా గందరగోళంగా కనిపిస్తుంటుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.3.50 కోట్లతో చీపురుపల్లి తదితర ఆస్పత్రుల్లో రెండంతస్తుల భవనాలను నిర్మించారు. కానీ, బొబ్బిలిలో ఆ నిధులు సరిపడక ఒక అంతస్తుతోనే సరిపెట్టేశారు. పై అంతస్తు ఉంటే మరికొన్ని వార్డులు, సమావేశపు హాలు, వైద్యుల రూములు, పలు విభాగాలకు సరిపడా వసతి సమకూరేది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పై అంతస్తు నిర్మాణానికి అదనపు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు రాలేదు.

- రేడియాలజిస్టు, ఫార్మసిస్టు, ఎన్‌ఎంఏ, జూనియర్‌ అసిస్టెంట పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైనేజీవ్యవస్ధ సక్రమంగా లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా ఉంటోంది. ఆసుపత్రిలోని పాతభవనాలు, పోస్టుమార్టం గదితో సహా అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. సర్జరీ గదిలో ఇంకా వసతులను మెరుగుపరచాల్సి ఉంది.

- స్థానిక గ్రోత్‌సెంటర్‌లోని ఓ పరిశ్రమ యజమాని సీఎస్‌ఆర్‌ నిధులతో సీహెచ్‌సీకి రెండో అంతస్తును నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. జిల్లాలోని అనేక నియోజకవర్గ కేంద్రాల్లోని సీహెచ్‌సీలు వంద పడకలుగా ఎదిగాయి. కానీ, బొబ్బిలి సీహెచ్‌సీకి ఇంకా గ్రహణం వీడడం లేదని రోగులు వాపోతున్నారు. స్థలం కొరత కారణంగా ఈ ప్రతిపాదనను అటకెక్కిస్తున్నారు. ఇప్పటికైనా వంద పడకలు ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని రోగులు కోరుతున్నారు.

ఉద్యమిస్తాం

బొబ్బిలి సీహెచ్‌సీని వందపడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాల్సిందే. రోగులకు సంతృప్తికరమైన సేవలు అందుతున్న నేపథ్యంలో అందుకుతగ్గ వసతులు లేకపోవడం బాధాకరం. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు, ఖాళీగా ఉండే ప్రభుత్వ పాత భవనాలకు కొదవలేదు. గ్రోత్‌సెంటరులో కూడా ఖాళీస్థలాలున్నాయి. రోగులకు అత్యవసర సేవలను అందించే సీహెచ్‌సీకి సకల సదుపాయాలతో వందపడకల ఆసుపత్రిని తక్షణం ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అవసరమైతే ఉద్యమిస్తాం.

-రేవెళ్ల కిరణ్‌కుమార్‌, మాజీసైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు

సౌకర్యాలు కల్పించాల్సి ఉంది

ఆసుపత్రిని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్న మాట వాస్తవమే. భవనంపై మరో అంతస్తు నిర్మిస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. గతంలో ఇచ్చిన నిధులు సరిపడలేదు. మళ్లీ అంచనాలు పంపించాం. నిధులు రావాల్సి ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కింద ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగికి సంబంధించిన వివరాలన్నిటినీ ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. అందుకు తగ్గ వసతులు కల్పించాలి. అత్యవసరంగా వందపడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తే ఈ ప్రాంత రోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రోగులు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.

- శశిభూషణరావు, వైద్యాధికారి, బొబ్బిలి సీహెచ్‌సీ

వసతులు కల్పిస్తాం

పారిశ్రామికవేత్తలు పెద్దమనసుతో ముందుకొచ్చారు. సామాజిక సేవా పథకం కింద కోటి రూపాయలు ఇచ్చేందుకు సమ్మతి తెలిపారు. అధికారులతో చర్చించి బొబ్బిలి, బాడంగి సీహెచ్‌సీలకు అవసరమైన వసతులను కల్పిస్తాం. వందపడకల ఆసుపత్రికి అవసరమైన స్థలసేకరణ కోసం కృషి చేస్తాం. ఆసుపత్రులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. సీఎస్‌ఆర్‌ నిధులను వెచ్చించాలని సంబంధిత యాజమాన్యంతో మాట్లాడాం.

-బేబీనాయన, ఎమ్మెల్యే

Updated Date - Jul 10 , 2026 | 12:06 AM