పాడి ఎక్కువ.. దాణా తక్కువ
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:09 AM
రైతాంగానికి మరింత సాయంగా పాడి పోషణ ఉంటుంది. ఆ రంగంలో వారు రాణించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకా లు అందిస్తుంది.
- బొబ్బిలి డివిజన్‌కు 50 టన్నులే కేటాయింపు
-నాలుగైదు గ్రామాలకే వస్తున్న వైనం
-పశు పోషణకు రైతుల ఇబ్బందులు
- కేటాయింపులు పెంచాలని వినతి
బొబ్బిలి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రైతాంగానికి మరింత సాయంగా పాడి పోషణ ఉంటుంది. ఆ రంగంలో వారు రాణించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకా లు అందిస్తుంది. అయితే, ఆ ప్రోత్సాహకాలు ఆశించిన రీతిలో ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి పశుసంవర్ధకశాఖ డివిజన్‌లోని 17 మండలాల పరిధిలో 1,38,930 ఆవులు, 11,453 గేదెలు ఉన్నాయి. అలజంగి, పక్కి, రామభద్రపురం, కొట్టక్కి, పెంట, తదితర గ్రామాల్లో పశుపోషణ విరివిగా ఉంది. వ్యవసాయం కన్నా పాల దిగుబడి, గిట్టుబాటు ఆశించిన రీతిలో ఉంటుందని రైతులు చెబుతున్నారు. అయితే, వాటి పోషణ కోసం రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుపోషణ రైతులకు కష్టతరమవుతోంది. పాడిరైతులకు పశు పోషణ నిమిత్తం ప్రభుత్వం 50 శాతం రాయితీపై దాణాను సరఫరా చేస్తోంది. ఈ కేటాయింపులు అరకొరగా ఉండడంతో రైతుల నుంచి దాణా కోసం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 21 శాతం ప్రొటీన్స్ ఉన్న 50 కిలోల బస్తాను సగం ధరకు రూ.560కు అందజేస్తోంది. వేల సంఖ్యలో పాడి పశు వులు ఉండగా కేవలం 50 టన్నుల దాణాను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 50 టన్నులు అధిక పశువులు ఉండే మూడు నాలుగు గ్రామాలకే సరిపోతున్నాయి. డివిజన్ పరిధిలో ఇంకా మిగిలి ఉన్న గ్రామాల రైతులకు ఏమి సమాఽధానం చెప్పాలో అధికారులకు అర్ధం కావడం లేదు. ఒక ఆవుకు రోజుకు 4 కిలోల చొప్పున దాణా అవసరం ఉంటుంది. దీని ప్రకారం నెలకు నాలుగైదు బస్తాల దాణా కావాలి. ప్రైవేట్ మార్కెట్‌లో దాణా కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. అలా అయితే పశుపోషణ ఆర్థికభారం అవుతుంది. ఎల్‌నినో నేపథ్యంలో పశుఆహార భద్రత పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
- ఎల్‌నినో నేపథ్యంలో పశు ఆహారభద్రత కోసం ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. 1200 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఉపాధి హామీపథకంలో బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలను పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ ద్వారా కూడా పీఎండీఎస్ (ప్రి మాన్‌సూన్ డ్రై సోయింగ్) కిట్లను రైతులకు పంపిణీ చేస్తున్నారు.
దాణాను సరఫరా చేయాలి
నీటి వసతి అంతగా లేని గ్రామాల్లో పశుపోషణ చేసుకునే వారికి రాయితీపై సరిపడా దాణాను సరఫరా చేయాలి. ప్రైవేట్ మార్కెట్‌లో దాణాను కొనుగోలు చేసి పశువులను పోషించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి సబ్సిడీపై దాణా కేటాయింపులను పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలా అయితే మా పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
- నాగిరెడ్డి రమణమ్మ, రాజుపేట
డిమాండ్ ఉంది
పశు దాణాకు విపరీతమైన డిమాండ్ ఉంది. రైతుల అవసరాలకు సరిపడా దాణాను మేము అందించలేకపోతున్నాం. రైతుల వినతులు మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. 21 శాతం ప్రొటీన్స్ ఉండే ఈ దాణా పశువులకు ఎంతో ఆరోగ్యకరకమైనది. పాల ఉత్పత్తికి దోహదపడుతుంది. రైతులకు 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నాం.
-డాక్టర్ ఎల్.విష్ణు, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, బొబ్బిలి