Here Come the Kumkis! అదిగదిగో కుంకీలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:48 PM
Here Come the Kumkis! జిల్లాకు రెండు కుంకీలు వచ్చేస్తున్నాయి. శుక్రవారం అవి మంగళగిరి నుంచి మన్యానికి బయల్దేరాయి. పలమనేరు నుంచి జిల్లాకు వస్తున్న కుంకీలు జయంత్, అభిమన్యుకు మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. వాటికి చెరకు గెడ్డల్ని ఆహారంగా అందించారు. అనంతరం కుంకీలకు పూలమాలలు వేసి జిల్లాకు సాగ నంపారు. కాగా అవి శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికి అవి మన్యం చేరుకోను న్నాయి.
ఎలిఫెంట్ జోన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు
వాటి ద్వారా జిల్లాలో అటవీ ఏనుగుల కట్టడి
ప్రభుత్వ చర్యలపై సర్వత్రా హర్షం
పార్వతీపురం, జూలై24(ఆంధ్రజ్యోతి): జిల్లాకు రెండు కుంకీలు వచ్చేస్తున్నాయి. శుక్రవారం అవి మంగళగిరి నుంచి మన్యానికి బయల్దేరాయి. పలమనేరు నుంచి జిల్లాకు వస్తున్న కుంకీలు జయంత్, అభిమన్యుకు మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. వాటికి చెరకు గెడ్డల్ని ఆహారంగా అందించారు. అనంతరం కుంకీలకు పూలమాలలు వేసి జిల్లాకు సాగ నంపారు. కాగా అవి శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికి అవి మన్యం చేరుకోను న్నాయి. తొలుత వాటిని సీతానగరం మండలం గుచ్చిమిలోని ఎలిఫెంట్ జోన్‌కు తరలించ నున్నారు. కొద్ది రోజుల పాటు కుంకీలు అక్కడే ఉండనున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుంకీల వెంట చిత్తూరు జిల్లా ఏనుగుల పర్యవేక్షణ అధికారి రఘునాఽథన్, పలమనేరు సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్, ట్రాకర్స్, పర్యవేక్షణ సిబ్బంది, ఇతర ఉన్నారు. ఇదిలా ఉండగా ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఈనెల 29న డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. జిల్లాలో పార్వతీపురం డివిజన్‌లో ఎనిమిది, పాలకొండ డివిజన్‌లో నాలుగు గజరాజులు సంచరిస్తున్నాయి. కుంకీల ద్వారా వాటిని మచ్చిక చేసుకుని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారు.
దశాబ్దాల సమస్యకు తెర
కుంకీల రాకతో.. దశాబ్దాలుగా వేధిస్తున్న గజరాజుల సమస్యకు తెరపడనుందని మన్యం వాసులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సంచరిస్తున్న 12 గజరాజులు కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజరాజుల దాడిలో జిల్లాలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. గత వైసీపీ సర్కారు హయాంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిహారాన్ని రూ.పది లక్షలకు పెంచింది. ఏనుగుల కారణంగా 2017 నుంచి ఇప్పటివరకు మన్యంలో సుమారు 3,811 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు నష్టపోయారు. అయితే వారికి రూ.2.79 కోట్ల వరక పరిహారంగా అందించారు. కాగా జిల్లావాసులను దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఏనుగుల సమస్యను జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కుంకీల రాకకు చొరవ చూపారు. అంతేగాకుండా ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు భారీగా నిధులు మంజూరు చేశారు. మొత్తంగా మన్యంకు కుంకీలు వస్తుండడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తొలగనున్నాయని అభిప్రాయపడుతున్నారు.
రెండు కుంకీలు వస్తున్నాయి
జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు వస్తున్నాయి. వాటిని సీతానగరం మండలం గుచ్చిమిలోని ఎలిఫెంట్ జోన్‌కు తరలిస్తాం. కాగా ఈ నెల 29న ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని వర్చువల్ విధానం ద్వారా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభిస్తారు.
- ప్రసూన, డీఎఫ్‌వో, పార్వతీపురం మన్యం