hemalata facing problems హేమలతకు కష్టాల పరీక్ష
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:46 PM
hemalata facing problems చిన్నతనం నుంచి దేశానికి సేవ చేయాలన్నదే ఆమె తపన... ఆ కలను సాకారం చేసుకోవడం కోసం క్రీడలను ఎంచుకున్నారు. చక్కని ప్రతిభ చూపారు. ఎన్నో పథకాలను సాధించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆపై క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలని అలుపెరగకుండా శ్రమిస్తున్నారు.
హేమలతకు కష్టాల పరీక్ష
ఆటల్లో శభాష్ అనిపించుకున్న మహిళ
పరీక్ష రాయడానికి వెళ్తూ కొద్దిరోజుల కిందట రోడ్డు ప్రమాదం
కాలు తొలగించిన వైద్యులు
ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటున్న జిల్లా ప్రజలు
చిన్నతనం నుంచి దేశానికి సేవ చేయాలన్నదే ఆమె తపన... ఆ కలను సాకారం చేసుకోవడం కోసం క్రీడలను ఎంచుకున్నారు. చక్కని ప్రతిభ చూపారు. ఎన్నో పథకాలను సాధించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆపై క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలని అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆ ప్రయాణంలో ఆమెకు విధి పెద్ద పరీక్ష పెట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో పెద్ద అగాధం లాంటి కష్టంలో పడేసింది. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు ఆమె కాలిని తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటనతో గుండె బరువెక్కిన ఆమెకు ఆసరా దొరకాలనీ, భరోసా దక్కాలని జిల్లా ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. గంట్యాడ మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వర్రి హేమలత పరిస్థితి ఇది.
గంట్యాడ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):
మురపాక గ్రామానికి చెందిన వర్రి హేమలత ఇంటర్ చదువుతుండగా కుస్తీ, జూడో వంటి క్రీడలపై ఆసక్తి చూపించారు. రెండు సంవత్సరాల పాటు కఠోరమైన కృషి చేసి పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. 15 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడితే తొమ్మిది సార్లు బంగార పతకాలు, మూడు సిల్వర్, మూడు రజత పతకాలు సాధించారు. జాతీయ క్రీడా పోటీల్లో తొమ్మిది సార్లు పాల్గొన్నారు. ఆమెకు చిన్నతనం నుంచి ఆర్మీలో చేరి సేవ చేయాలన్నది కల. క్రీడా రంగంలో చక్కని ప్రతిభ చూపిస్తే ఉద్యోగం సంపాదించవచ్చని ఈ రంగంపైనా ఆసక్తి చూపించారు. పోటీ పరీక్షలు రాస్తున్నారు. అందులో భాగంగా ఎస్‌ఎస్‌సీ జీడీలో రెండు సార్లు, సీఐఎస్‌ఎఫ్‌లో రెండు సార్లు, ఎస్‌ఐ పోస్టుకు ఒక్కసారి హాజరై మెరుగైన మార్కులు సాధించారు. ఒకటి లేదా రెండు మార్కులు మాత్రమే చాలక ఉద్యోగాలు చేజారాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో ఒకవైపు డిగ్రీ, మరోవైపు బీపీఈడీ చదువు పూర్తి చేశారు. ఈనెల 6వ తేదీన బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు ఆమె విజయనగరం వెళ్తుండగా బాలాజీ మార్కెట్ వద్ద రోడ్డు పక్కన నిల్చొన్న ఈమెను కారు ఢీకొంది. ఆమె పైనుంచి దూసుకెళ్లడంతో కుడికాలిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె కన్నీరును దిగమింగుతూ మంచానికే పరిమితమయ్యారు. హేమలతకు మేనమామ గుల్లుపల్లి సత్యనారాయణతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా ఉద్యోగం సాధిస్తానని భర్తకు ఆమె మాట ఇచ్చింది. ఈ ప్రయత్నంలో కారు ప్రమాదం ఆమె ఆశయాన్ని చిదిమేసింది. ప్రభుత్వం స్పందించి సహకరించాలని జిల్లా ప్రజలంతా కోరుకుంటున్నారు.