మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:33 PM
సీతంపేట మన్యంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
సీతంపేట రూరల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. సుమారు గంటకు పైగా కుండపోత వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గాలుల తీవ్రతకు తురాయిపువలసలో విద్యుత్ లైన్‌పై చెట్టు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు ఎంపీడీవో, ఐటీడీఏ కార్యాలయ పరిసరాల్లో రెండు విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సీతంపేటలో విద్యుత్ నిలిచిపోవడంతో ట్రాన్స్‌కో ఏఈ నీలిమ ఆధ్వర్యంలో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ వ్యాప్తంగా వర్షం కురవడంతో మన్యం ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న మన్యంవాసులకు ఈవర్షం ఊరటనిచ్చింది.