Heavy Downpour మన్యంలో కుండపోత
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:41 PM
Heavy Downpour in the Agency Area జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం కుండ పోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారులపై వర్షపునీరు నిలిచింది. వాహనదారులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రధానంగా ఉరుములు, మెరుపులు, గాలులకు జనం బెంబేలెత్తిపోయారు.
ఉరుములు, మెరుపులతో జనం బెంబేలు
భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం
జీడిమామిడి, అరటి, మొక్కజొన్న పంటలకు దెబ్బ
సీతంపేట రూరల్/ సాలూరు రూరల్/వీరఘట్టం/భామిని, మార్చి20(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం కుండ పోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారులపై వర్షపునీరు నిలిచింది. వాహనదారులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రధానంగా ఉరుములు, మెరుపులు, గాలులకు జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులు, ఉరుముల శబ్దాలతో గంటకు పైగా వర్షం కురిసింది. సీతంపేట మండలం పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారి జలమయమైంది. అల్పపీడన ప్రభావంతో సీతంపేట మన్యంలో కురిసిన అకాలవర్షానికి జీడి, మామిడి పూతలు రాలిపోయే ప్రమాదం ఉందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాలూరు ఏజెన్సీలోనూ గాలివాన భీభత్సం సృష్టించింది. పట్టణంలో మాత్రం వడగాళ్ల వాన కురిసింది. పట్టణంలో కాలువలన్నీ ఉప్పొంగి రోడ్లుపై ప్రవహించాయి. వీరఘట్టంలోనూ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భామిని మండలంలోని బత్తిలి , బాలేరులో చిరుజల్లులు కురిశాయి. కాగా ఆయా ప్రాంతాల్లో గత రెండు రోజులు నుంచి వాన పడుతుం డడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను నష్టపోయే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా కొద్దిరోజులుగా ఎండవేడితో ఉక్కిరిబిక్కిరైన మన్యం వాసులు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.
మొక్కజొన్న, అరటి పంటలు ఇలా..
సీతానగరం (బలిజిపేట)/గరుగుబిల్లి/వీరఘట్టం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండ లంలోని సుమారు 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో గౌరీపురం, అరసాడ, మురగడాం, చాకరాపల్లి, చిలకలపల్లి, తదితర గ్రామాల్లో పంట నేలవాలింది. గురు, శుక్రవారాల్లో వీచిన గాలులు, కురిసిన వర్షాలకు గరుగుబిల్లి మండలంలో రావివలస, సంతోషపురం, ఖడ్గవలస, తోటపల్లి, నందివానివలస, గిజబ గ్రామాల్లో అరటి పంట నేలకొరిగింది. వీరఘట్టం మండలంలో చిట్టిపుడివలస, కిమ్మి, నడుకూరు, దశమంతుపురం, తూడి తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది.