Share News

వేతనజీవులకు వడదెబ్బ

ABN , Publish Date - May 25 , 2026 | 12:11 AM

Heatwave for Salaried Employees ఉపాధి వేతనదారులు భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నారు. పనులు చేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక ఉసూరుమంటున్నారు. ఎండ వేడి, ఉక్కపోతకు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. చివరకు వడదెబ్బ లక్షణాలతో ఆసుపత్రి పాలవు తున్నారు.

వేతనజీవులకు వడదెబ్బ
మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

ఉపాధి’ పనులు చేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువు

టెంట్లు, తాగునీరు కూడా ఏర్పాటు చేయని వైనం

ఏజెన్సీలో ఠారెత్తిస్తున్న ఎండలు

డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రి పాలవుతున్న గిరిజనులు

సీతంపేట రూరల్‌, మే24(ఆంధ్రజ్యోతి): ఉపాధి వేతనదారులు భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నారు. పనులు చేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక ఉసూరుమంటున్నారు. ఎండ వేడి, ఉక్కపోతకు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. చివరకు వడదెబ్బ లక్షణాలతో ఆసుపత్రి పాలవు తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లోనూ ఉపాధి వేతనదారుల పరిస్థితి ఇలానే ఉంది. రోజూ ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు , మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వేతనదారులతో ఉపాధి పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పని వేళల్లో మార్పులు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఎండతీవ్రత ఉదయం 7 గంటల నుంచే ఎక్కువగా ఉండడం, పనులు చేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కొరవడడంతో వేతనదారులు వడదెబ్బకు గురై ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలోని 15 మండలాల్లో 450 గ్రామ పంచాయతీల్లో సుమారు 383 ఉపాధి పనులు జరుగుతున్నాయి. రోజూ 1,68,759 మంది కూలీలు పనులు చేస్తున్నారు. వర్షపు నీటి సంరక్షణలో భాగంగా సోక్‌పిట్స్‌, ట్రెంచ్‌లు, చెరువు చానల్స్‌, ఫాంపాండ్స్‌ వంటి పనులు చేపడుతున్నారు. అయితే పనులు చేస్తున్న ప్రదేశాల్లో వేతనదారులకు రక్షణగా ఎక్కడా కూడ నిలువ నీడ ఉండడం లేదు. గుక్కెడు నీరు కూడా దొరకడం లేదు. దీంతో ఉపాధి వేతనదారులు వడదెబ్బకు గురై ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

- నిబంధనల మేరకు ఉపాధి పనులు ప్రదేశంలో నీడకోసం టెంట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, పనిముట్లతో పాటు కూలీలకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు వంటివి అందుబాటులో ఉంచాలి. కానీ అవేవీ కానరావడం లేదు.

- గతంలో మార్చి నుంచి వేసవి అలవెన్స్‌లను ఉపాధి వేతనాలతో కలిపి చెల్లించేవారు. కానీ అవి కూడా గత కొంతకాలంగా వేతనదారులకు చెల్లించడం లేదు.

- కొంతమంది వేతనదారులు తమ ఇంటి వద్ద నుంచి మజ్జిగ, తాగునీరు, తలకి టోపి వంటివి వారితో పాటు తీసుకువెళ్లి ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు డీహైడ్రేషన్‌కు గురై సొమ్మసిల్లిపడితున్నారు.

- ముఖ ఆధారిత నమోదు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) సక్రమంగా కాకపోవడంతో పనులు చేసే ప్రదేశంలో కూలీలు ఎండల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది.

- సీతంపేట ఏజెన్సీలో రోజూ 40 నుంచి 44డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉపాధి పనులు చేసే కూలీలు వడదెబ్బకు లోనై ఆసుపత్రులు పాలవుతున్నారు. జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వికారం వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతుతున్నారు. గడచిన కొద్ది రోజులుగా డీ హైడ్రేషన్‌ కేసులతో దోనుబాయి, కుసిమి, మర్రిపాడు పీహెచ్‌సీలతో పాటు సీతంపేట ఏరియా ఆసుపత్రి వడదెబ్బ రోగులతో కిటకిటలాడుతోంది. డీ హైడ్రేషన్‌కు గురై సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చేరుతున్న వేతన దారులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని, ఈ పరిస్థితిని ఎంపీడీవోకు వివరించామని ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు చెప్పారు. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్దిరోజులు ఉపాధి పనులు నిలుపుదల చేస్తే బావుంటుందని తెలియజేశామన్నారు.

కనీస సౌకర్యాలు లేక..

‘ కొంతకాలంగా రుక్మిణిగూడ, మొగదార, మొగదారగూడ గ్రామ పరిసరాల్లో ఉపాధి పనులు చేస్తున్నాం. అయితే అక్కడ కనీససౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. పనివేళల్లో మార్పులు తీసుకొచ్చినప్పటికీ నిలువనీడ లేక వడదెబ్బకు గురవుతున్నాం. ఎండవేడికి తట్టుకోలేక మా గ్రామంలో కొందరు ఉపాధి పనులకు రావడమే మానేశారు. ’ అని రుక్మిణిగూడకు చెందిన ఉపాధి వేతనదారుడు సవర రుగ్గయ్య తెలిపాడు.

ఏపీడీ ఏమన్నారంటే..

ఉపాధి పనులు జరిగే ప్రదేశంలో వేతనదారుల కోసం టెంట్లు, తాగునీరు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు గతంలో అందుబాటులో ఉండేవి.. అయితే ఇప్పుడు అవేవీ పనులు పనిచేసే ప్రదేశం లో లేవు. దీనిపై ప్రభుత్వానికి నివేదించాం. అని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీడీ శ్రీహరి తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 12:11 AM