వేడెక్కిన ‘స్థానిక’ సమరం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:10 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.
- వ్యూహల్లో రాజకీయ పార్టీలు
- వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కూటమి పార్టీలు
- అభ్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం
- అదే బాటలో వైసీపీ
పార్వతీపురం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు పనుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో టీడీపీ నుంచి ఒక ఇన్‌చార్జి నియామకాన్ని ఇప్పటికే అధిష్టానం పూర్తి చేసింది. ఆ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొదటి విడత సమావేశాలు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే, ముఖ్య నాయకులతో సమావేశాలు జరిగాయి. గత నెల 30న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన సంంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూటికి నూరుశాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని, అభ్యర్థులు ఎవరైనా ఐకమత్యంతో పనిచేయాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఇక రేపోమాపో మండలాల వారీగా సమావేశాలు నిర్ణయించే అవకాశం ఉంది.
అభ్యర్థులను నిర్ణయించేది అధిష్టానమే...
స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను అధిష్టానమే నిర్ణయించనుంది. వారు ఏ పదవికి పోటీ చేయాలో అధిష్టానమే చెబుతుంది. ఒక్కొక్క పదవికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ముగ్గురి పేర్లు అధిష్టానానికి వెళ్లిన తర్వాత, ఎవరు బరిలో ఉండాలో నిర్ణయిస్తుంది. ఈ మేరకు శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు పంపించింది.
అభ్యర్థులను సిద్ధం చేస్తున్న వైసీపీ..
స్థానిక ఎన్నికల్లో అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు వారి గెలుపునకు కృషి చేసిన వారికే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎలా ఉన్నా ముందుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.