Hear our cry... మా మొర వినరూ...
ABN , Publish Date - May 01 , 2026 | 12:29 AM
Hear our cry... వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె ఎదురుచూస్తోంది. పలుమార్లు గ్రామ సచివాలయానికి వెళ్లింది.
మా మొర వినరూ...
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు
ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నపాలు
దాదాపు రెండేళ్లు అవుతున్నా ఆ ఊసెత్తని కూటమి ప్రభుత్వం
నాలుగేళ్లుగా ఫ్రీజింగ్‌లో వెబ్‌సైట్
అర్హుల్లో నిరాశ
శృంగవరపుకోట ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి)
వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె ఎదురుచూస్తోంది. పలుమార్లు గ్రామ సచివాలయానికి వెళ్లింది. వెబ్‌సెట్ తెరుచుకోకపోవడంతో అక్కడి అధికారులు దరఖాస్తు తీసుకోలేదు. స్థానిక టీడీపీ నాయకులతో పాటు గ్రామానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులను నిత్యం సంప్రదిస్తోంది. వారి నుంచి సరైన సమాధానం లేదు.
ఫ శృంగవరపుకోట శ్రీనివాసకాలనీకి చెందిన ఓ వ్యక్తికి వృద్ధాప్య పింఛనుకు అర్హత ఉండడంతో 2022 నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేస్తున్నాడు. ఈయన టీడీపీ సానుభూతి పరుడని అప్పట్లో పని చేసిన ఓ వాలంటీరు అడ్డుకుంటూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకు పింఛను మంజూరవుతుందని నమ్మకంగా ఉన్నాడు. ఇంకా దరఖాస్తుకు అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందుతున్నాడు.
ఫ లక్కవరపుకోట క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 22న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ సమస్యలపై 46 వినతులు వచ్చాయి. ఇందులో 26 పింఛన్లు కోరుతూ వచ్చినవే. ఇదే విధంగా ఏప్రిల్ 27న నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వచ్చిన 14 విన్నపాల్లో 10 పింఛను మంజూరు చేయాలని కోరినవే.
- ఇలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల చూట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛను ఇప్పించండంటూ వేడుకుంటున్నారు. జిల్లా, మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల ప్రజావేదిక (పీజీఆర్‌ఎస్)ల్లోనూ, మంత్రులు, శాసన సభ్యులు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ల్లోనూ పింఛన్ల కోసమే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఇచ్చిన దరఖాస్తులు ప్రతి మండలంలోనూ 350 నుంచి 500 వరకు ఉన్నాయి. సామాజిక పింఛన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా 10,000 నుంచి 12000 వరకు వుంటాయని అంచనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకు దగ్గర పడుతోంది. కానీ సామాజిక పింఛన్ల ఊసెత్తడం లేదు. దీంతో అర్హత కలిగి వారంతా లోలోన మండిపోతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త విధానాన్ని తెచ్చిన గత వైసీపీ ప్రభుత్వం
రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం పింఛన్ల నమోదు పక్రియను నిరంతరం కొనసాగించేది. అర్హత కలిగిన లబ్ధిదారులు వారంలో ఏ రోజైన దరఖాస్తు చేసుకోనేందుకు వీలుండేది. ఏ వారానికి ఆ వారం పరిశీలించిన అధికారులు నెలాఖరులో అర్హత కలిగిన జాబితాను రూపొందించేవారు. మరుసటి నెల నుంచి పింఛను అందించేవారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది. ఆరు నెలలకోసారి ప్రతి జూన్, డిసెంబర్ నెలలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను అవలంభించింది. ఇందుకు సిక్స్ స్టెప్ నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. వైసీపీ అనుకూల వ్యక్తులకు మంజూరు చేసి, మిగిలిన వారికి సిక్స్ స్టెప్ నిబంధనల్లోని ఒక దానిని తప్పుగా చూపించి తిరస్కరించడం పరిపాటిగా జరిగేది. 2023 నుంచి ఇలా కూడా మంజూరు చేయలేదు. వెబ్‌సెట్‌ను పూర్తిగా ఫ్రీజింగ్‌లో ఉంచారు. 2024లో వైసీపీకి ప్రజలు చరమగీతం పాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రూ.3వేలున్న సామాజిక పింఛను రూ.4వేలకు పెంచింది. కొత్తగా సామాజిక పింఛన్లను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తుందని అర్హత కలిగిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆశించారు. కానీ ఇందుకు భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయితే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను అందేలా మాత్రం చర్యలు తీసుకుంటోంది.
ఏ అసరా లేని అర్హత కలిగిన వృద్ధులు, ఒంటరి వితంతు మహిళలు, దివ్యాంగులు ప్రభుత్వ సాయం కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ పింఛనుదారుల వయోపరిమితిని 50 సంవత్సరాలకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. దీంతో వీరు కూడా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అంశం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన గ్రామ స్థాయి కూటమి నేతల్లో కనిపిస్తోంది.
----