యోగాతో ఆరోగ్యం
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:43 PM
‘నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుంది.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
- నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోండి
- ప్రతీ పాఠశాలలో సూర్యనమస్కారాలు తప్పనిసరి
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
- ఘనంగా యోగా దినోత్సవం
పార్వతీపురం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ‘నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుంది.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు యోగాసనాలు వేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎస్పీ మాధవరెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలు తప్పనిసరి చేసిన మొట్టమొదటి జిల్లాగా పార్వతీపురం మన్యం రికార్డు సృష్టించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలు ఏకకాలంలో యోగాసనాలు వేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని, ఇందులో మన్యం జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. పెద్ద ఎత్తున యోగా సాధకులు హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రజల్లో ఉన్న ఆరోగ్య చైతన్యానికి ఇది నిదర్శనమన్నారు. నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఒత్తిడిలేని, ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, మన సంస్కృతి అందించిన అమూల్యమైన, ఆరోగ్యపరమైన కార్యక్రమమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో 12 పతకాలు సాధించి వారికి, జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులకు కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, డీఆర్వో హేమలత, ఆర్డీవో కె.మాధురి, మున్సిపల్ కమిషనర్ డి.పావని, డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీసీహెచ్‌వో నాగభూషణరావు, డీఆర్‌డీఏ పీడీ పద్మావతి, డీఈవో బ్రహ్మాజీరావు, డీవీఈవో నాగేశ్వరరావు, జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి టి.జగన్మోహనరావు, వైద్యాధికారి టి.హేమాక్షి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ఏపీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కిషోర్, సీఐలు వెంకటరావు, రంగనాథంతో పాటు పట్టణ ప్రముఖులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.