ఆరోగ్యానికి ముప్పు
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:41 PM
కాలంతో పాటు మారిన జీవనశైలి, అధిక పని ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం వంటివి జిల్లా వాసుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి.
- జిల్లాలో 1.31లక్షల మందికి హైబీపీ
- 90,801 మందికి షుగర్
- నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల బాధితులు కూడా ఎక్కువే
- ఎన్‌సీడీ 4.0 స్ర్కీనింగ్‌లో గుర్తించిన ఆరోగ్యశాఖ
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాలంతో పాటు మారిన జీవనశైలి, అధిక పని ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం వంటివి జిల్లా వాసుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), క్యాన్సర్‌లు ప్రజల జీవితాన్ని గుల్ల చేస్తున్నాయి, వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన ఎన్‌సీడీ 4.0 స్ర్కీనింగ్ ప్రోగ్రాం సర్వేలో విస్తుపోయిన వాస్తవాలు వెల్లడయ్యాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీతో పాటు క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిని గుర్తించారు. అయితే, సర్వేలో తేలిన మరో ముఖ్య విషయం ఏమంటే.. దాదాపు సగం మందికి బీపీ, షుగర్, క్యాన్సర్ వంటివి వ్యాధులు ఉన్నట్లు తెలియదు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినప్పుడో లేదా వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడో కానీ ఈ సమస్యలు బయటపడడం లేదు. ముందస్తుగానే వ్యాధులు గుర్తించి వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటికీ వెళ్లి ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
జిల్లాలో పరిస్థితి..
జిలాల్లో 18 ఏళ్లు పైబడిన జనాభా 16,15,202 మంది ఉన్నారు. వీరిలో 10,18,721 మందికి స్ర్కీనింగ్ పూర్తయింది. ఇందులో 1,31,337 (12.89శాతం) మందిలో అధిక రక్తపోటు ఉంది. మరో 36,355మంది అనుమానితులుగా ఉన్నారు. 90,801 (8.91శాతం) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 35,520 అనుమానిత కేసులు ఉన్నాయి. నోటి క్యాన్సర్‌తో 488 (0.04 శాతం), మరో 24,251 మందిలో అనుమానిత లక్షణాలు కనిపించాయి. రొమ్ము క్యాన్సర్ 401 (0.04శాతం) మందిలో బయటపడగా, 11,859 మందిలో లక్షణాలు ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్ 432 (0.04శాతం) మందికి నిర్థారణ కాగా, 15,316 మందిలో లక్షణాలు కనిపించాయి.
ముందస్తు గుర్తింపే శ్రీరామ రక్ష
బీపీ, షుగర్ వంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు, సరైన వైద్యం, క్రమపద్ధతిలో మందులు వినియోగించడం వల్ల పూర్తిగా నియంత్రించవచ్చునని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే, సరైన చికిత్సలతో పూర్తిగా నిర్మూలించవచ్చును. ఏ మాత్రం ఆలసత్వం వహించినా గుండె జబ్బులు, పక్షవాతం, మూత్ర పిండాలవైఫల్యం, శరీర అవయవాల క్షీణత వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యుపీహెచ్‌సీ), బీపీ, షుగర్‌తో పాటు వివిధ రకాల క్యాన్సర్లకు సంబంధించి ఉచిత స్ర్కీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి భయం లేకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుని ముందస్తు వ్యాధులను అరికట్టాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.
ముందస్తు పరీక్షలతోనే ఆరోగ్యం సురక్షితం
బాధితులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించడమే లక్ష్యంగా ఎన్‌సీడీ 4.0 సర్వే నిర్వహించాం. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధుల సంకేతాలు ఉన్నవారు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని పీహెచ్‌సీలు లేదా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో వీటికి సంబంధించిన ఔషధాలు, మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఉచితంగా స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.
-డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, విజయనగరం