ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:33 PM
గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధ్యానత ఇస్తుందని గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
- మంత్రి సంధ్యారాణి
- విద్యార్థులకు దోమతెరల పంపిణీ
పాచిపెంట రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధ్యానత ఇస్తుందని గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం బడ్నాయకవలస గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6.88లక్షల మంది విద్యార్థులకు దోమతెరలను అందించామన్నారు. జిల్లాలో 28 వేల మందికి అందిస్తున్నట్లు చెప్పారు. దోమతెరలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు.
దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి...
డీఎస్సీ నియామకాలపై చర్చించేందుకు దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి సంధ్యారాణి సవాల్ విసిరారు. ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టి ఏడాది అయిన తర్వాత ఇప్పుడు గొడ్డలి పార్టీ విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రబుత్వం ఒక్క ఉపాధ్యాయి నియామకమైనా చే పట్టిందా అని ప్రశ్నించారు. పారదర్శకంగా రాష్ట్రంలో 16,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
50 ఏళ్లకే గిరిజనులకు పింఛన్లు
50 ఏళ్లకే గిరిజనులకు పింఛన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం బడ్నాయికవలసలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్య క్రమాన్ని నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ ఈ రెండేళ్లలో కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు.
మంత్రి దృష్టికి సమస్యలు..
పెద్దగెడ్డ జలాశయంలో చేపల వేటకు తమకు కూడా అవకాశం కల్పించాలని బడ్నాయికవలస, కాగులుగడ్డ, బుచ్చంపాడు, ఆడారిపాడు గిరిజనులు మంత్రిని కోరారు. పులిగుంటవలస గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని, పద్మాపురం జంక్షన్ నుంచి కుంతాం గ్రామానికి రోడ్డు అధ్వాన్నంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని ఆయా ప్రాంత గిరిజనులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోడ్డు ఏర్పాటుకు సుమారు రూ.2.50కోట్లు ఇప్పటికే మంజూరుయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గూడేపు యుగంధర్, సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, వైద్యాధికారి శివకుమార్, నాయకులు పూసర్ల నరసింగరావు, మంచాల నారాయణరావు, ఆదినారాయణ, సావిత్రి, బర్ల పోలిరాజు తదితరులు పాల్గొన్నారు.