Health clinics coming soon త్వరలో అందుబాటులోకి హెల్త్ క్లినిక్‌లు
ABN , Publish Date - May 31 , 2026 | 12:09 AM
Health clinics coming soon కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 4500 హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టామని, అవన్నీ త్వరలో అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. హెల్త్ క్లినిక్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు మంజూరు చేసిందని వివరించారు
త్వరలో అందుబాటులోకి హెల్త్ క్లినిక్‌లు
జిల్లాకు క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు చేశాం
ప్రజారోగ్యాన్ని విస్మరించిన వైసీపీ
ఆస్పత్రుల్లో ఓపీ పెరుగుతోంది
పీపీపీ విధానంలోనే మెడికల్ కళాశాలలు
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్
రాజాం రూరల్, మే 30(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 4500 హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టామని, అవన్నీ త్వరలో అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. హెల్త్ క్లినిక్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. రాజాంలోని తృప్తి రిసార్ట్స్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ తప్పిదాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యవ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, శాఖపై రూ.6500 కోట్లు అప్పులభారం మిగిల్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఆ అప్పుల్ని తీర్చడం ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలో 175 హెల్త్ క్లినిక్‌లను రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టామన్నారు. అలాగే పబ్లిక్ హెల్త్ యూనిట్, రెండు పిహెచ్‌సి.లు, ఒక ల్యాబ్ ఇచ్చామన్నారు. జిల్లాలో క్రిటికల్ ట్రామా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రూ.23 కోట్ల అంచనా వ్యయంతో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందనేందుకు ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో ఇంటింటా పర్యటిస్తూ మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా 41 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, హైపర్‌టెన్షన్, షుగర్ వ్యాధిగస్తులను గుర్తించి వారు ఏస్థాయిలో ఉన్నారో గుర్తించి, సంజీవిని డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా అవసరమైన మందులతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఏఐ సహకారంలో సులభంగా వ్యాధుల్ని గుర్తించడం, తక్కువ సమయంలో చికిత్స చేయిస్తున్నా మన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలలో వ్యాధుల నిర్ధారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయని, వాటి నివారణకు వైద్యశాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసకుంటోందన్నారు.
పీపీపీ విధానంలోనే మెడికల్ కళాశాలలు
మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలోనే నిర్మించి కొనసాగిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది పిడుగురాళ్ల కళాశాలను ప్రారంభిస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని నిర్మించలేకపోయిందని ఎద్దేవా చేశారు. నాబార్డ్ రూ.8500 కోట్లు నిధులిస్తే కేవలం రూ.1500 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎక్కడిపనులు అక్కడే వదిలేసిందని ఆరోపించారు.
జనంలోకి బీజేపీ
బీజేపీ నాయకత్వం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ 12 పాలనతో పాటు రెండేళ్ల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూన్ 5 నుంచి 21 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.