Share News

Head constable's son attacks government teacher. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు దాడి

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:20 AM

Head constable's son attacks government teacher. పాఠశాల గేటుకు అడ్డుగా ఉన్న కారు తీయమన్నందుకు ఓ హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. హెచ్‌ఎం చాంబర్‌లోనే అందరి ఎదురుగా ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. దీంతో సదరు ఉపాధ్యాయుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది.

Head constable's son attacks government teacher. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై   హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు దాడి

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై

హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు దాడి

పాఠశాల గేటుకు అడ్డుగా ఉన్న కారు తీయమన్నందుకు వివాదం

హెచ్‌ఎం చాంబర్‌లో అందరి ఎదురుగా దాడి.. టీచర్‌కు గాయాలు

రాజాం ఏరియా ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స

రాజాం రూరల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): పాఠశాల గేటుకు అడ్డుగా ఉన్న కారు తీయమన్నందుకు ఓ హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. హెచ్‌ఎం చాంబర్‌లోనే అందరి ఎదురుగా ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. దీంతో సదరు ఉపాధ్యాయుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..

టీచర్లు అందించిన వివరాల మేరకు.. డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్‌ను డ్రాప్‌ చేసేందుకు కుమారుడు శుక్రవారం ఉదయం కారులో వెళ్లాడు. ఈ యువకుడి తండ్రి జిల్లాలోని ఓ పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌. సదరు యువకుడు కారును గేటుకు ఎదురుగా పెట్టాడు. ఈ సమయంలో ప్రేయర్‌ జరుగుతోంది. దీంతో పాఠశాల పీఈటీ సుజాత కారు పక్కకు తీయాలని చెప్పారు. వినకపోవడంతో చిన్నపాటి కర్రతో కారు మీద కొట్టారు. కోపోద్రిక్తుడైన సదరు యువకుడు ఆమెపై చిర్రుబుర్రులాడాడు. ఇలా చేయడం తగదని అదే పాఠశాల టీచర్‌

లాభాల వేణు అభ్యంతరం చెప్పాడు. దీంతో సదరు యువకుడు హెడ్‌ కానిస్టేబుల్‌ అయిన తన తండ్రికి ఫోన్‌లో చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత హెడ్‌కానిస్టేబుల్‌ వచ్చి కొడుకుతో హెచ్‌ఎం రూములోకి వెళ్లాడు. అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసేందుకు అక్కడే ఉన్న ఉపాధ్యాయుల సమక్షంలోనే.. తల్లి అడ్డుకుంటున్నా ఉపాధ్యాయుడు వేణును సదరు యువకుడు దాడి చేశాడు. దీంతో వేణు గాయపడగా.. చికిత్స నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తనను కూడా కొట్టారంటూ హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు ఏరియా ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

ఫిర్యాదు చేశాం: ఆర్‌.వి.జి.ఎన్‌. మురళికృష్ణ, హెచ్‌.ఎం. డోలపేట న్నత పాఠశాల

ఘటనపై ఇతర ఉపాధ్యాయులతో కలిసి వెళ్లి పొలీసులకు ఫిర్యాదు చేశాను. నా చాంబర్‌లో నా సమక్షంలో లాభాన వేణుని కొట్టాడు. ఒకేసారి తండ్రి, కొడుకు నా గదిలోకి రావడం, వస్తూనే ఉపాధ్యాయుడిపై చేయి చేసుకోవడంతో అంతా షాక్‌కు గురయ్యాం. తల్లి వారిస్తున్నా కుమారుడు కొట్టడం ఖండించాల్సిన విషయం.

చర్యలు తీసుకోవాల్సిందే: కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ

ఉపాఽధ్యాయుడిపై హెడ్‌ కానిస్టేబుల్‌ కొడుకు దాడికి పాల్పడడం బాధాకరం. ఉపాధ్యాయుడిపై దాడిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రాజాం టౌన్‌ సీఐ అశోక్‌ను కోరాను. భవిష్యత్తులో ఇంకెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినచర్యలు తీసుకోవాలి. డోలపేట హెచ్‌.ఎం. మురళీకృష్ణ, గాయపడిన ఉపాధ్యాయుడు వేణుతో మాట్లాడాను.

దాడిని ఖండిస్తున్నాం: మజ్జి మధన్‌మోహన్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పాఠశాలలో ఉపాధ్యాయుడు వేణుపై దాడికి పాల్పడడం ఖండిస్తున్నాం. దాడిచేసిన వ్యక్తిపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలని పొలీసులను డిమాండ్‌ చేస్తున్నాం.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: చంద్రశేఖర్‌ రావు, యూటీఎఫ్‌ అధ్యక్షుడు

హెచ్‌.ఎం. గదిలోకి వచ్చి అందరి ఎదుట ఉపాధ్యాయుడిపై చేయి చేసుకోవడం సరికాదు. ఇలాంటి చర్యలు ఉపాద్యాయుల భద్రత విషమంలో ఆందోళన కలిగిస్తోంది. గేటు వద్ద కారును అడ్డంగా తీయమనడంతో పాఠశాల పీఈటీ సుజాతతో వాగ్వాదం పెంచుకుని, ఆపై మరో ఉపాధ్యాయడు వేణుని కొట్టిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలి.

డీఈవోకు నివేదించా: యాగాటి దుర్గారావు, ఎంఈవో, రాజాం

అక్కడ ఏం జరిగిందో ఉపాధ్యాయుల నుంచి సమాచారం సేకరించాను. జరిగిన విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడుకి ఫోన్లో వివరించాను లిఖిత పూర్వకంగా నివేదించాను.

ఎవరూ పిర్యాదు చేయలేదు: అశోక్‌కుమార్‌, రాజాం టౌన్‌ సీఐ

డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన విషయంపై ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:20 AM