కన్నకొడుకే చంపేశాడు
ABN , Publish Date - May 16 , 2026 | 12:26 AM
నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచింది ఆ తల్లి. కొడుకుని ప్రయోజకుడ్ని చేస్తే జీవిత చరమాంకంలో తోడుగా ఉంటాడని ఆశించింది.
- స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన వైనం
- కత్తులతో పొడిచిన మైనర్లు
- నగదు, బంగారంతో పరారీ
- మాఫియాలో చేరాలన్నదే వారి ఆకాంక్ష
- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
-వివరాలు వెల్లడించిన డీఎస్పీ
రాజాం రూరల్, మే 15 (ఆంధ్రజ్యోతి): నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచింది ఆ తల్లి. కొడుకుని ప్రయోజకుడ్ని చేస్తే జీవిత చరమాంకంలో తోడుగా ఉంటాడని ఆశించింది. ఈక్రమంలో బిడ్డ బాగుపడాలని కొన్ని ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో కుమారుడు 525 మార్కులు సాధించడంతో ఆమెలో ఆశలు రెట్టింపయ్యాయి. ఇంటర్‌లో మంచి కళాశాలలో చేర్చాలని కలలు కంటున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే తల్లి తనపై చూపిస్తున్న చిరుకోపం, చిరాకు, పెడుతున్న నిబంధనలను ఆ బిడ్డ సహించలేకపోయాడు. తల్లిపై కొన్నాళ్లుగా కసి పెంచుకున్నాడు. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికొచ్చాడు. ఇదే సమయంలో ఏడాది కిందట క్రికెట్ గ్రౌండ్‌లో ఇంటర్ పరీక్షలు రాయకుండా తిరుగాడుతున్న ఓ కుర్రాడు పరిచయం అయ్యాడు. ఆ కుర్రాడు కూడా ఇంట్లో నిరాదరణకు గురై కుటుంబ సభ్యులపై తీవ్ర కోపం, అసహనంతో జీవిస్తున్నాడు. కాలక్రమంలో ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలూ కలిసిపోవడంతో వీరిద్దరి బంధం బలపడింది. ఇద్దరూ ముంబై వెళ్లి మాఫియాలో కలిసిపోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో తన తల్లిని కడతేర్చాలన్న తన మనసులోని మాటను స్నేహితుడికి చెప్పాడు. దీంతో ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. స్నేహితుడితో కలిసి తల్లిని బాత్‌రూంలో బంధించి కత్తులతో కసితీరా పొడిచి చంపేశారు. రక్తాన్ని తుడిచేశారు. మృతదేహాన్ని ఇంటి వెనుకభాగంలో ముళ్లపొదలు ఉన్న చెరువు సమీపంలో పడవేశారు. ఇంట్లో బీరువాలో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, ఐదు వేల నగదుతో పాటు ఓ మొబైల్‌తో పరాయ్యారు. పలాస, విశాఖ, ఆపై ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి వెళ్లగా అక్కడి పోలీసులు సహకారంతో స్థానిక పోలీసులకు పట్టుబడ్డారు. రాజాం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజాం టౌన్, రూరల్ సీఐలు అశోక్‌కుమార్, ఉపేంద్రతో కలిసి చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వివరాల మేరకు.. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట ముంజేటివీధికి చెందిన ముంజేటి స్పందన(35) అనే మహిళను ఆమె కుమారుడు మరో స్నేహితుడితో కలిసి ఈనెల 4న అత్యంత దారుణంగా, పాశవికంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఇటీవలే పదోతరగతి ఉత్తీర్ణుడైన కొడుకుపట్ల స్పందన కఠినంగా వ్యవహరించడం, అడుగడుగునా నిబంధనలు విధించడంతో తల్లిపై కసి పెంచుకున్నాడు. ఇదే సమయంలో ఇటీవల తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తల్లికి చెప్పడంతో ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎలాగైనా తల్లిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఏడాదిగా కలిసిమెలిసి తిరుగుతున్న తన స్నేహితుడికి వివరించాడు. దీంతో సరేనన్నాడు. ఇందుకోసం ప్రణాళిక రచించారు. ఈనెల 4న స్నేహితుడిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో తల్లి స్పందన లేకపోవడంతో రమ్మని ఆమెకు కాల్ చేశాడు. తన తల్లి ఇంటికిరాగానే బాత్‌రూంకి వెళ్తుందని, నువ్వు అక్కడే ఉండి హతమార్చాలని స్నేహితుడికి సూచించాడు. కొడుకు కాల్ చేయడంతో ఇంటికి వచ్చింది స్పందన. అప్పటికే ప్లాన్ ప్రకారం బాత్‌రూంలో మాటువేసి ఉన్న స్నేహితుడు కుడిచేతితో స్పందన గొంతునొక్కడం ప్రారంభించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఎడమచేతితో స్పందన నోరుమూశాడు. దీంతో ఆ కుర్రాడి ఎడమచేతిని స్పందన కరవడం ప్రారంభించింది. నొప్పిని భరిస్తూ స్పందనను వదిలిపెట్టలేదు. కొద్దిసేపటికి స్పందన బాత్‌రూంలో నేలపై పడిపోవడంతో అక్కడే ఉన్న స్పందన కొడుకుతో పాటు స్నేహితుడు రెండు చాకులతో కసిగా ఆమె శరీరంపై 12 నుంచి 15 సార్లు గట్టిగా పొడిచారు. ఆమె మృతి చెందిందని నిర్ధారణకు వచ్చాక ఇద్దరూ బాత్‌రూంలో రక్తాన్ని శుభ్రం చేశారు. మృతదేహాన్ని ఇంటివెనుక ఉన్న ముళ్లపొదల సమీపంలో చెరువువద్ద పడవేశారు. ఇద్దరూ బట్టలు మార్చుకుని చాకుల్ని దూరంగా పారవేశారు. ఇంట్లో బీరువాలో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, ఐదు వేల నగదు, స్పందన మొబైల్‌ను తీసుకుని ఇంటి నుంచి పరారీ అయ్యారు.
రాజాం టూ ముంబై..
ముంబై వెళ్లాలని అక్కడ మాఫియాలో కలవాలన్న ఆకాంక్షతో ఉన్న ఇద్దరూ తొలుత పలాస ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ తెలిసిన ఓ స్నేహితుడి వద్ద ఈనెల 4న రాత్రి బస చేశారు. అక్కడి నుంచి నేరుగా ముంబైకి వెళ్లారు. ఇద్దరి వద్ద సిమ్‌లు లేని మొబైల్స్ ఉండడంతో ఇన్‌స్టాలో స్నేహితులకు మెసేజ్ చేసేవారు. వీరిద్దరి కదలికలను గుర్తించిన పొలీసులు పలాస ప్రాంతంలో వీరికి ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి లభ్యమైన సమాచారం ప్రకారం ముంబైలో ఉన్నట్లు పొలీసులు నిర్ధారించుకున్నారు. అప్పటికే వీరికోసం గాలిస్తున్న అయిదు బృందాల్లో ఓ బృందం ముంబైలో వీరున్న ప్రదేశాన్ని గుర్తించి స్థానిక పోలీసుల సహకారం కోరింది. ఇంతలో అక్కడి పొలీసుల కన్నుకప్పి నేరుగా తిరుపతి చేరుకున్నారు. వీరిద్దరి కదలికలను గుర్తించిన రాజాం పోలీస్ బృందం తిరుమల, తిరుపతి పొలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, ఓ బంగారు కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో ఇద్దరికి వైద్యపరీక్షలు నిర్వహించి శ్రీకాకుళంలోని జువైనల్ బోర్డు ఎదుట శుక్రవారం సాయంత్రం హాజరుపరిచారు.