ఉపాధి పొందిన చోటే విగతజీవుడై..
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:55 PM
ఇన్నాళ్లూ ఎక్కడైతే చెప్పులు కుడుతూ జీవనం సాగించాడో అక్కడికి మూడు నాలుగు అడుగుల దూరంలోనే రోడ్డు ప్రమాదంలో విగతజీవుడైన ఓ నిరుపేద ఉదంతమిది.
చెప్పులు కుట్టే కార్మికునిగా అందరికీ సుపరిచితం
బస్సు ఎక్కుతుండగా కాలు జారి మృతి
బొబ్బిలి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ ఎక్కడైతే చెప్పులు కుడుతూ జీవనం సాగించాడో అక్కడికి మూడు నాలుగు అడుగుల దూరంలోనే రోడ్డు ప్రమాదంలో విగతజీవుడైన ఓ నిరుపేద ఉదంతమిది. రోజూ ఉత్సాహంగా వృత్తి పనిచేసు కుంటూ కనిపించే వ్యక్తి అంతలోనే మృత్యుతీరా నికి చేరడాన్ని చూసిన వారంతా కన్నీరు పెట్టారు. ఊహించని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బొబ్బిలి పట్టణంలోని సంగవీధికి చెందిన నందిక అంజయ్య విషాదాంతమిది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగవీధికి చెందిన నందిక అంజ య్య (60) మంగళవారం ఉదయం భార్య పుష్పమ్మ, మనవళ్లతో కలిసి రాజాం లో ఉంటున్న కుమారుడు పైడిరాజు ఇంటికి బయలుదేరాడు. స్థానిక చర్చిసెం టరులో ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి అదే బస్సుకిందపడి పో యాడు. భార్య గమనించేలోపే తీవ్ర గాయాలతో మృత్యుతీరానికి చేరిపోయాడు. అంజయ్య ప్రతిరోజూ చర్చిసెంటరులో ఘటనా స్థలానికి సుమారు మూడు, నాలుగు అడుగుల దూరంలో డ్రైనేజీ కాలువ పక్కన చెప్పులు కుడుతుండేవారు. ఆ సమీపంలోనే ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందడాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. విధి ఎంత విచిత్రమైనది అంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు. అంతవరకూ తనతో కలివిడిగా మాట్లాడిన భర్త అచేతనంగా మారడాన్ని ప్రత్యక్షంగా చూసిన భార్య జీర్ణించుకోలేకపోతోంది. కన్నీరుమున్నీరైంది. ఎస్‌ఐ రమేష్, ట్రాఫిక్ ఎస్‌ఐ జ్ఞానప్రసాద్, ఏఎస్‌ఐ సన్యాసిరావులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్‌ఐలు తెలిపారు.